Attack On SP Office In Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చురాచంద్‌పూర్ ఎస్పీ కార్యాలయంపై గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 మంది గుంపు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ హింసాత్మక చర్యలకు దిగినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. వారిని అడ్డుకోవడం, పరిస్థితిని నియంత్రించడం కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్‌లను ఉపయోగించాయని మణిపూర్ పోలీసులు తెలిపారు.
"ఈ రోజు సుమారుగా 300 నుంచి 400 మంది ఎస్పీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెక్యూరిటీ ఫోర్స్ టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని మణిపూర్ పోలీసులు సోషట్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ముగ్గురు మృతి
చురాచంద్‌పూర్ ఎస్పీ కార్యాలయంపై గురువారం జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. మూకుమ్మడి దాడిలో ఒకరు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తరువాత మృతుల సంఖ్య మూడుకు చేరినట్లు తెలిసింది. అలాగే సాయుధ వ్యక్తులతో కనిపించినందుకు హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆందోళన కారులతో పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చురచంద్‌పూర్ ఎస్పీ శివానంద్ సర్వే హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతా యుతమైన పోలీస్ ఉద్యోగంలో ఉంటూ సాయుధులతో కలిసి కూర్చొని ఉండడం క్రమశిక్షణారాహిత్య చర్యగా పేర్కొన్నారు. అలాగే సియామ్‌లాల్‌పాల్ ముందస్తు అనుమతి లేకుండా స్టేషన్‌ను విడిచిపెట్టవద్దని అధికారులు సూచించారు. అతని జీతం, అలవెన్సులు నిబంధనల ప్రకారం అందుతాయని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ సేవలను నిలిపేసిన ప్రభుత్వం
ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి 1:40 నుంచే సెక్షన్ 144 విధించింది. అంతే కాకుండా చురచంద్‌పూర్ జిల్లాలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రజలను రెచ్చగొట్టే చిత్రాలు, పోస్ట్‌లు, వీడియో సందేశాలు కోసం సోషల్ మీడియాను ఆందోళన కారులు విస్తృతంగా ఉపయోగించవచ్చనే ఆందోళన నేపత్యంలో ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం అయ్యే రెచ్చగొట్టే, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కోసం, ప్రాణ, పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపాడేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.