What Is Wrong To Stay In Both The Houses: ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లోనూ సభ్యుడిగా  కొనసాగితే  తప్పేంటని వచ్చిన నష్టమేంటని రాష్ట్రీయ లోక్ తంత్ర్ పార్టీ ( ఆర్ ఎల్ పీ ) నేత, ఎంపీ హనుమాన్ బెనివాల్ ప్రశ్నించారు. ఇలాంటివి సాధ్యమయ్యేలా నిబంధనలు మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 2023 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఖిన్వసర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హనుమాన్‌ బెనివాల్ ఎమ్మెల్యేగా ఉంటూనే  నాగౌర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏంపీ పదవికి పోటీ చేశారు. ఎంపీగా గెలిచిన అనంతరం ఆయన తన ఎమ్మెల్యే పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా సమర్పించిన తర్వాత బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాలో రెండు సభల్లోనూ సభ్యుడిగా కొనసాగించేందుకు అక్కడి రాజ్యాంగం అనుమతిస్తుందని బారత్ లోనూ నిబంధనలు సడలించి రెండు సభల్లోనూ సభ్యులుగా కొనసాగేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పారు. 


‘‘భారత రాజ్యాంగంలోె ఆర్టికల్ 101(2) ప్రకారం ఏ వ్యక్తికీ  పార్లమెంటు, విధాన సభ రెండింటిలో ఏక కాలంలో సభ్యులుగా కొనసాగే అవకాశం లేదు.  కానీ ఒకేసారి, ఒకే సమయంలో  ఈ రెండు సభల్లో సభ్యుడిగా కొనసాగే అవకాశం భారతదేశంలోని రాజకీయ నాయకులకు ఇవ్వాలి.   అమెరికాలో ఇలాంటి వెసులుబాటు ఉండగా భారతదేశంలో ఎందుకు ఉండకూడదు? ఓ వ్యక్తికి రెండు పదవులు ఉండటంలో అసలు ఇబ్బందేంటి? దాని వల్ల జరిగే నష్టమేంటి?  ప్రజలే  కదా  మమ్మల్ని ఎన్నుకుంది..’’ అని ప్రశ్నించారు. 


తాను రాజీనామా చేసిన ఖిన్వసర్ నియోజకవర్గం నుంచి తిరిగి ఆర్‌ఎల్‌పీ పోటీ చేస్తుందని బెనివాల్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పొత్తుపై ఇప్పటికింకా నిర్ణయించలేదని వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జవాన్లను రిక్రూట్ చేసుకునే విషయంలో పాత పద్ధతినే పాటించాలని డిమాండ్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి మేము వ్యతిరేకంగా పోరాడుతాం. పాత పద్ధతిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు.  ఆర్ ఎల్ పీ ప్రస్తుతం ఇండి అలయెన్సులో కొనసాగుతోంది. 


2008లో భాజపా టికెట్ పై పోటీ చేసి బెనివాల్ తొలిసారి ఖిన్వసర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2013లో ఇతర పార్టీల నేతలతో అంటకాగుతున్నారనే ఆరోపణలతో భాజపా అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అక్కడే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి బినివాల్ గెలిచారు. రైతు సభలు, ర్యాలీలు నిర్వహణ ద్వారా బాగా పాపులర్ అయిన బెనివాల్ 2018లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీని స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు.  ఆ పార్టీ తరఫున అదే సంవత్సరం తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 2019లో నాగౌర్ నుంచి భాజపాతో జతకట్టి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.  కానీ రైతు చట్టాలపై వ్యతిరేకతతో తిరిగి ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చేశారు. 2023లో ఇండి కూటమికి మద్దతిచ్చారు.