భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు.  బిపిన్‌ రావత్‌ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్‌ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్‌ చివరినాటికి రిటైర్‌ కానున్నారు. ఈ కారణంగా  ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్‌ పాండే నియామకం ఖరారు అయ్యింది. 






పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత, శ్రీలంకలో అల్లకల్లోలం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, అటు రష్యా-ఉక్రెయిన్ యుద్దం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బాధ్యతలు మనోజ్ పాండేకు అప్పగిస్తూ భారత డిఫెన్స్ మినిష్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉన్నతాధికారుల తరువాత సీనియర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పాండే ఉన్నారు. ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ రాజ్‌శుక్లా  ఈనెల 31న రిటైరవుతున్నారు. 


గత జనవరి 31న సీనియర్ మోస్ట్ అధికారులైన లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతీ, లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిలు పదవీ విరణణ చేశారు. దీంతో ఈ నెలాఖరులోనే కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా స్థానంలో ఏఆర్‌టీఆర్ఏసీ కమాండ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ మహల్ సిమ్లాలో బాధ్యతలు చేపడతారు.  ఉత్తర భారత్ ఏరియాకు జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ జేపీ మాథ్యూస్ బాధ్యతలు చేపడతారు.


ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్‌ మనోజ్‌ పాండే. అంతకు ముందు మనోజ్‌ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్‌ పాండే.. ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.