Manipur Women Viral Video: 


బైరెన్ సింగ్ ట్వీట్ 


మణిపూర్‌లో ఇప్పటి వరకూ జరిగిన హింస ఒకెత్తైతే..ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ పాత వీడియో సృష్టించిన సంచలనం మరో ఎత్తు. పార్లమెంట్‌నీ ఇది కుదిపేస్తోంది. రెండు నెలల క్రితం ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఫలితంగా...అన్ని పార్టీలు బీజేపీపై తీవ్రంగా మండి పడుతున్నాయి. పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే నిందితుడుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఈ వీడియోపై స్పందించారు. నిందితులందరినీ కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష వేసే యోచనలో ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా అవమానించడాన్ని చూసి గుండె మండిపోయిందని అన్నారు. సుమోటోగా స్వీకరించిన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


"ఇద్దరు మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వీడియో చూసి నా గుండె మండిపోయింది. చాలా దారుణమైన చర్య ఇది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాం. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు..ఉరిశిక్ష వేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇలాంటి అమానవీయ ఘటనలకు మన సమాజంలో తావు లేదు"


- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి