Manipur Viral Video:
రాజీనామా చేయరు..
మణిపూర్‌లో వైరల్ వీడియోపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్‌లూ తెరపైకి వచ్చాయి. విపక్షాలు ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే బైరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే...విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు లేవని తేల్చి చెబుతున్నారు కొందరు.
"ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు లేవు. అసలు ఆ ఆలోచనే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యం. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అక్కడి కుకీ వర్గానికి చెందిన ప్రజలతో మాట్లాడారు. వీలైనంత వేగంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది"
- విశ్వసనీయ వర్గాలు
గతంలోనూ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బైరెన్ సింగ్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నా... పరిస్థితులు అదుపులోకి తీసుకురాలేకపోయారు బైరెన్ సింగ్. ఈ క్రమంలోనే ఆయన జూన్ 30న గవర్నర్‌ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారన్న వార్త వినిపించింది. అయితే...ఆయన ఇంటి వద్దకు వందలాది మంది మహిళలు చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ నినదించారు. ఆయన గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ...వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన రాజీనామా లేఖనీ చించేశారు. ఈ చించేసిన రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరవాత స్వయంగా బైరెన్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
నలుగురు అరెస్ట్...
మణిపూర్ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌నీ కుదిపేసింది. ఇప్పటికే ఈ అమానుషానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ప్రకటించారు. ఆ తరవాత మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి నలుగురు అరెస్ట్ అయ్యారు. మహిళను వివస్త్రను చేసి లాక్కెళ్లిన వ్యక్తిని థౌబల్ జిల్లాలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ వీడియోపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఎప్పుడో రెండు నెలల క్రితం ఇంత దారుణం జరిగితే...ఇన్ని రోజుల పాటు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలోనూ మణిపూర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 70 రోజుల తరవాత నిందితులను అరెస్ట్ చేయడంపైనా మండి పడుతున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో మళ్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి.
Also Read: NDA 2024 Plan: ఎన్డీఏ పార్టీలకు విజయ సూత్రాలు- ఎంపీలను టీమ్స్‌గా చేసి జులై 25 నుంచి ప్రధాని పాఠాలు