Manipur Violence: 


మోదీ మౌనంపై అసహనం..


మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కాంగ్రెస్ చాలా రోజులుగా ప్రశ్నిస్తోంది. అసలు మణిపూర్‌ దేశంలో భాగమే కాదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండి పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మన్‌కీ బాత్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ (జూన్ 18) మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మణిపూర్‌ ప్రస్తావనే తీసుకురాకపోవడంపై ఫైర్ అయ్యారు. "మీ మన్‌కీ బాత్‌లో మణిపూర్‌ కీ బాత్‌ కూడా ఉంటే బాగుండేది" అని సెటైర్లు వేశారు. ఇన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావడం లేదని, అయినా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అసలు ఈ అల్లర్లపై ఒక్కసారి కూడా ప్రధాని సమీక్ష చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


"నరేంద్ర మోదీజీ మీ మన్‌కీ బాత్‌లో మణిపూర్‌ కీ బాత్ ఉండుంటే బాగుండేది. ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. అక్కడి పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పట వరకూ ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. బహుశా మీ ప్రభుత్వం మణిపూర్‌ని దేశంలో భాగమే కాదని భావిస్తున్నట్టుంది. రాష్ట్రమంతా మండిపోతుంటే మీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. రాజధర్మాన్ని పాటించండి. శాంతికి భంగం కలిగించే అంశాలను పట్టించుకోండి. పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చి అక్కడి ప్రజలకు నమ్మకం కలిగించండి"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. కాంగ్రెస్‌తో పాటు మొత్తం 10 పార్టీలు లెటర్ రాశాయి. ఇంత వరకూ స్పందించకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అసహనం వ్యక్తం చేశారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లక ముందే స్పందించాలని డిమాండ్ చేశారు. 


మళ్లీ హింస..


మణిపూర్‌లో మరోసారి ఆందోళనకారులు రెచ్చిపోయారు. బిష్ణుపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఆటోమెటిక్ వెపన్స్‌తో కాల్పులు జరిపారు. జూన్ 16 న అర్ధరాత్రి మొదలైన ఈ కాల్పులు..తెల్లవారుజాము వరకూ కొనసాగినట్టు పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున నిరసనకారులు గుమిగూడి విధ్వంసం సృష్టించారు. పలు చోట్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఇంఫాల్‌లో అర్ధరాత్రి వరకూ పోలీసులు, ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు ఇళ్లకు నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఒకేసారి వెయ్యి మంది ఒక్క చోట చేరారు. ఈ లోగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది అప్రమత్తమై టియర్ గ్యాస్‌తో దాడి చేసింది. రబ్బర్ బులెట్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మణిపూర్ యూనివర్సిటీ వద్ద కూడా భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. రాత్రి 10.40 నిముషాలకు 200-300 మంది గుమిగూడి స్థాని ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆర్ఏఎఫ్‌ బలగాలు నిరసనకారులపై దాడి చేయడం వల్ల అంతా చెల్లాచెదురయ్యారు. సింజెమాయ్‌లోని బీజేపీ ఆఫీస్‌పైనా దాడికి యత్నించారు.


Also Read: Heatwave: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉష్ణోగ్రతలు, 98 మంది మృతి - వేసవి సెలవులు పొడిగింపు