Manipur Violence:
ఇంటర్నెట్‌పై బ్యాన్...
మణిపూర్‌లో (Manipur Tensions) ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించింది అక్కడి ప్రభుత్వం. కానీ...మళ్లీ అక్కడక్కడా హింసాత్మక ఘనటలు జరుగుతున్న క్రమంలో మళ్లీ ఇంటర్నెట్‌పై (Manipur Internet Ban)ఆంక్షలు విధించింది. నవంబర్ 5వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. విద్వేషపూరిత ప్రసంగాలు, మెసేజ్‌లు, పోస్ట్‌లు, వీడియోలు షేర్ చేయకుండా ఈ బ్యాన్ విధించింది. వారం రోజుల్లోనే రెండు సార్లు ఈ ఆంక్షల్ని పొడిగించింది మణిపూర్ ప్రభుత్వం. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ ఆంక్షల్ని తొలగిస్తామని ఇటీవలే ప్రకటించారు ముఖ్యమంత్రి ( N. Biren Singh) ఎన్. బైరెన్ సింగ్. కొంతమంది కావాలనే కుట్రపూరితంగా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చొగొట్టే పోస్ట్‌లు, వీడియోలు షేర్ చేస్తున్నారన్నది ప్రభుత్వం వాదన. ఇంటర్నెట్ సేవల్ని ఇలాగే కొనసాగిస్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని భావించి ముందుగానే ఇలా జాగ్రత్త పడుతోంది.
అక్కడక్కడా దాడులు..
కేంద్ర భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని మణిపూర్ డీజీపీ కూడా వెల్లడించారు. కన్వెన్షన్ హాల్స్ పై దాడులకు యత్నించడం సహా కొందరి నేతల ఇళ్లనూ ధ్వంసం చేయాలని కుట్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటే ఈ అల్లర్లు మరింత పెరిగే ప్రమాదముందని, అందుకే ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధిస్తున్నామని ప్రభుత్వం వివరించింది. ఇంటర్నెట్ బ్యాన్‌కి సంబంధించి ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ప్రాణాలతో చెలగాటమాడేందుకు కొన్ని గ్రూప్‌లు సిద్ధంగా ఉన్నాయని, వాళ్లని కట్టడి చేయాలంటే ఇప్పటికిప్పుడు ఇంటర్నెట్‌ని ఆపేయాల్సిందే అని స్పష్టం చేసింది.
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తరచూ ఘర్షణలు జరుగుతున్న క్రమంలో మొత్తం రాష్ట్రాన్ని "disturbed area"గా ప్రకటించింది. శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...రాష్ట్రంలో 19 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తప్ప మిగతా అన్ని చోట్లా Armed Forces Special Powers Act (AFSPA) అమలు కానుంది. అక్టోబర్ 1 నుంచి ఆర్నెల్ల పాటు ఇది అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. AFSPA లేని ప్రాంతాల్లో ఇంఫాల్ కూడా ఉంది. నిజానికి ఇక్కడే ఎక్కువగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కానీ..ఇక్కడ మాత్రం ఆ బలగాలను మొహరించడం లేదు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రహోం శాఖ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ AFSPA ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
"కొంత మంది పదేపదే హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న క్రమంలోనే సాయుధ బలగాలను మొహరించాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలపై నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఇక్కడ AFSPA కొనసాగుతుంది. గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపారు."
- మణిపూర్ ప్రభుత్వం
Also Read: షిఫ్ట్ టైమింగ్స్ పట్టించుకోకుండా పని చేస్తున్న ఇండియన్స్, వర్కింగ్ అవర్స్ ఇక్కడే ఎక్కువట - రిపోర్ట్