Opposition 'Phone Hacking' Row: 



ఐఫోన్ హ్యాకింగ్ అలెర్ట్స్..


విపక్ష నేతల ఫోన్‌ల ట్యాపింగ్ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా అలజడి రేగింది. యాపిల్ ఫోన్ కంపెనీల (Apple Hacking Alerts) నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు పలువురు ఎంపీలు ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్‌లే తమ ఫోన్‌లు ట్యాప్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు యాపిల్ కంపెనీ కొందరికి వార్నింగ్ అలెర్ట్స్ కూడా పంపింది. ఈ అంశాన్ని మోదీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యాపిల్ అధికారులకు సమన్లు జారీ చేసే యోచనలో ఉంది. త్వరలోనే వాళ్లతో భేటీ కానుంది. కీలక నేతలతో పాటు ప్రముఖుల ఐఫోన్‌లకు హ్యాకింగ్ అలెర్ట్ పంపడంపై చర్చించనుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సెక్రటేరియట్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. దీన్ని అంత సులభంగా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. విపక్ష నేతలు వీటిని state-sponsored attacksగా చెబుతున్నారు. ఈ అలెర్ట్స్ వచ్చిన వాళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, సుప్రియా శ్రీనాతే, టీఎస్ సింగ్‌దియో, భూపిందర్ సింగ్ హుడా, టీఎమ్‌సీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఐ (ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సమాద్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 






కొట్టి పారేసిన కేంద్రం..


వీళ్లతో పాటు ఉద్దవ్ థాక్రే శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సహా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సన్నిహితులకూ ఈ అలెర్ట్ వచ్చింది. అయితే...ఈ ఆరోపణల్ని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టి పారేశారు. ఇవన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఆరోపణలే అని మండి పడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే..దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా కచ్చితంగా దీనిపై విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరముందని తెలిపారు.