Manipur Violence:
జూన్ 29-30 వ తేదీల్లో పర్యటన..
మణిపూర్‌లో పరిస్థితులు అదుపులోకి రాని నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నో రోజులుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన.."మణిపూర్‌కి హీలింగ్ టచ్ అవసరం" అని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మణిపూర్‌లో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. జూన్ 29-30 వ తేదీల్లో అక్కడ రాహుల్ పర్యటిస్తారు. అక్కడి రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న ప్రజలతో మాట్లాడనున్నారు. ఇంఫాల్, చురచందపూర్‌లోని సివిల్ సొసైటీ ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇదే విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు.
"గత రెండు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ఓ హీలింగ్ టచ్ అవసరం. అక్కడి ప్రజలు ఈ అల్లర్ల నుంచి బయట పడి ప్రశాంతమైన జీవితం గడపాలి. మానవత్వానికి మచ్చ తెచ్చే విషాదమిది. అక్కడి వాళ్లకు ప్రేమ పంచడం మన బాధ్యత. అందుకే రాహుల్ గాంధీ జూన్29-30వ తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటిస్తారు"
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
300 రిలీఫ్ క్యాంప్‌లు..
ప్రస్తుతానికి మణిపూర్‌లో 300 రిలీఫ్ క్యాంప్‌లున్నాయి. వాటిలో 50 వేల మంది తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్యాంప్‌లలో ఉన్న వారిలో ప్రత్యి వ్యక్తికీ రూ.1000 మేర ఆర్థిక సాయం అందిస్తామని మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు. బట్టలు, ఇతరత్రా వ్యక్తిగత సామాన్లు కొనుగోలు చేసుకోడానికి ఈ సాయం చేస్తున్నట్టు తెలిపారు.
ఆల్‌పార్టీ మీటింగ్..
మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆల్ పార్టీ మీటింగ్‌కి (All Party Meeting) పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి NCP చీఫ్ శరద్ పవార్ హాజరు కాలేదు. అయితే...ఆ పార్టీ తరపున జనరల్ సెక్రటరీ నరేంద్ర వర్మ, మణిపూర్ ఎన్‌సీపీ చీఫ్ సోరన్ ఇబోయమా సింగ్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఆప్ లీడ్ సంజయ్ సింగ్ ఈ మీటింగ్‌కి వచ్చారు. ఇప్పటికీ మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వరుసగా దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు. మంత్రి సుసింద్రోకి చెందిన ఓ ప్రైవేట్ గోడౌన్‌కి నిప్పంటించారు. ఫలితంగా ఇంఫాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. మరో మంత్రి ప్రాపర్టీకి కూడా నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అయితే...అప్పటికే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నాయి. ఖురాయ్ ప్రాంతంలో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. టియర్ గ్యాస్‌తో సెక్యూరిటీ ఎదురు దాడికి దిగడం వల్ల ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించారు.
Also Read: Manipur Violence: పని చేయకుంటే జీతాల్లేవ్- మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు అల్టిమేటం