Manipur Violence: 



రెండు మతాల మధ్య వైరమా..? 


మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణ...ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ ఘర్షణకు దారి తీసింది. బీజేపీ ఓ వైపు...మిగతా పార్టీలన్నీ ఓ వైపు నిలబడ్డాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే అని తేల్చి చెబుతున్నాయి విపక్షాలు. మోదీ సర్కార్‌ని ఢీకొట్టడానికి దీన్నో అవకాశంగా మలుచుకున్నాయి. త్వరలోనే మణిపూర్‌లో పర్యటించేందుకు INDIA  కూటమిలోని కీలక నేతలు సిద్ధమవుతున్నారు. అక్కడి బాధితులకు దగ్గరై బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటన్నది పక్కన పెడితే...మొత్తంగా దేశ రాజకీయాల్ని మార్చేసింది మణిపూర్ హింసాకాండ. ఇప్పుడు పార్లమెంట్‌నీ ఈ సెగ తాకింది. దీనిపై బీజేపీ స్టాండ్ ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతానికి అక్కడి హింసను అదుపులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతోందే తప్ప ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. ప్రధాని మోదీ కూడా రెండు నెలల తరవాత స్పందించారు. ఇవన్నీ బీజేపీ మొరాలిటీని కొంత వరకూ ప్రశ్నించాయి. మణిపూర్‌లో జరుగుతోంది రెండు తెగల మధ్య పోరాటం మాత్రమే కాదని...హిందువులకు, క్రైస్తవులకు జరుగుతున్న యుద్ధం అని దీనికి మతం రంగు కూడా అంటించారు కొందరు. మైతేయిలు హిందువులు. కుకీలు క్రైస్తవులు. అందుకే ఈ కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీనిపై బీజేపీ ఏమీ స్పందించకపోయినప్పటికీ...RSS మాత్రం గట్టిగానే బదులిచ్చింది. అక్కడ జరుగుతున్న హింసను హిందువులు, క్రైస్తవుల మధ్య యుద్ధంగా భావించకూడదని తేల్చి చెప్పింది. 


RSS ఏం చెబుతోంది..?


RSS చెబుతున్న ప్రకారం చూస్తే...ఇది రెండు మతాల మధ్య ఘర్షణ కానే కాదు. కావాలనే కొన్ని పార్టీలు అనవసరంగా ఇందులోకి మతాన్ని లాగుతున్నాయని మండి పడుతోంది RSS.మణిపూర్‌ హింసాకాండకు ఏ పరిష్కారం చూపించాలో ఆలోచించాలే తప్ప దాన్ని మరింత సంక్లిష్టం చేసుకోకూడదని సలహాలిస్తోంది ఈ సంస్థ. అంతే కాదు. ఈ రాష్ట్రానికి చాలా లోతైన గాయమైందని,ఇది మానటానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని అంటోంది. ఈ హింసలో విదేశీ సంస్థల కుట్ర కూడా ఉండొచ్చని ఆరోపిస్తోంది. కొందరు కావాలనే చర్చ్‌ని పడగొట్టి గొడవలకు కారణమయ్యాయని చెబుతోంది. RSS వివరణను పక్కన పెడితే...మైతేయిల విషయంలో కుకీలు ఎప్పటి నుంచో తీవ్ర అసహనంతో ఉన్నారు. తమను మైనార్టీలుగా చూస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు కుకీలు. ఇటు మైతేయిలు కూడా తమవాదన వినిపిస్తున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి పెద్ద డ్రగ్స్‌ని రాష్ట్రంలోకి తీసుకొచ్చేది కుకీలే అని ఆరోపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 39 తెగలున్నాయి. వీరిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఇన్ని తెగలున్నప్పటికీ మెజార్టీ మాత్రం మైతేయి వర్గానిదే. 50%కిపైగా ఈ తెగ వాళ్లే ఉన్నారు. 43% మంది కుకీలు, నాగాలున్నారు. మైతేయిని మెజార్టీ కమ్యూనిటీ కాగా..కుకీలు, నాగాలు మైనార్టీలు. ఇప్పుడు గొడవ జరుగుతోంది మైతేయి, కుకీల మధ్య. మైతేయిలకు షెడ్యూల్ తెగ (ST)హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వానికి సూచించిందో అప్పటి నుంచి నిప్పు రాజుకుంది. అది క్రమంగా రాష్ట్రాన్ని మంటల్లోకి నెట్టేసింది.


Also Read: మణిపూర్‌ హింసపై INDIA కీలక నిర్ణయం, 2 రోజుల పాటు ఎంపీల పర్యటన