Manipur Violence: మణిపూర్‌లో మే 3వ తేదీన జాతి వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మరుసటి రోజే తొలి సారిగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగించుకుంటూనే వస్తున్నారు. అయితే మణిపూర్‌లోని హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలోని పరిస్థితి పదే పదే మారుతోందని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ ఆర్డర్‌ని అమలు చేయడం కష్టం అవుతుందని... దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
మణిపూర్‌లో గత రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఇంటర్నెట్‌ను నిషేధించి రెండు నెలలు దాటింది. ఇటీవలే మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని జూలై 10 వరకు పొడిగించింది. ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మణిపూర్ హైకోర్టు హోం శాఖ ఒక్కో కేసు వారీగా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చని పేర్కొంది.
జులై 25న హైకోర్టులో విచారణ
'పౌరుల జీవితాలు, ఆస్తుల' భద్రతను నిర్ధారించడంతోపాటు మొబైల్ ఫోన్‌లలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాలని మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి సమగ్ర నివేదికను కోర్టు కోరింది. దీనిపై కోర్టు జూలై 25న విచారణ చేపట్టనుంది. అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎ. బిమల్, జస్టిస్ ఎ. గుణేశ్వర్ శర్మ మాట్లాడుతూ, "ఫైబర్ టు ది హోమ్' (ఎఫ్‌టిటిహెచ్) కనెక్షన్‌ల విషయంలో, కమిటీ ఇచ్చిన భద్రతలకు లోబడి ఉండేలా చూసుకుంటూ హోమ్ డిపార్ట్‌మెంట్ కేసుల వారీగా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు." పేర్కొన్నారు.
మరోవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇప్పటికీ ఆగడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో శుక్రవారం రాత్రి (జూలై 7) ఆగ్రహానికి గురైన గుంపు రెండు వాహనాలను తగుల బెట్టింది. 150 నుంచి 200 మంది వ్యక్తులతో కూడిన ఓ గుంపు ఆగ్రహానికి గురై చారిత్రక కాంగ్లా కోట సమీపంలో రెండు వాహనాలకు నిప్పు పెట్టింది. అలాగే పోలీసుల నుండి ఆయుధాలను లాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలో రెండు వర్గాల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయి.
రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు..
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బైరెన్ సింగ్ రాజీనామా చేస్తారని కూడా ఓ దశలో ఊహాగానాలు వినిపించాయి. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నా... పరిస్థితులు అదుపులోకి తీసుకురాలేకపోయారు బైరెన్ సింగ్. అధిష్ఠానం కూడా దీనిపై అసహనంగా ఉన్నట్టు విశ్లేషణలు వినిపించాయి.. ఈ క్రమంలోనే ఆయన గవర్నర్‌ని కలిసి రాజీనామా సమర్పిస్తారని గతవారంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్దకు వందలాది మంది మహిళలు చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ నినదించారు. జనాల తాకిడి పెరుగుతుండటం వల్ల మరోసారి ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. బైరెన్ సింగ్ మద్దతుదారులు కూడా ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు. ఆయన గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ...వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన రాజీనామా లేఖనీ చించేశారు. ఈ చించేసిన రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరవాత స్వయంగా బైరెన్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.