Union Minister: కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో ఓ యువకుడి మృతదేహం కనిపించడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మంత్రి నివాసంలో శుక్రవారం శ్రీవాస్తవ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని అజయ్ రావత్, అంకిత్ వర్మ, షమీమ్ గాజీగా గుర్తించారు. మృతుడు శ్రీవాస్తవ.. కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడి అని పోలీసులు తెలిపారు. 


ఈ ఘటన అనంతరం మంత్రి కిషోర్ మాట్లాడుతూ.. కాల్పులు జరిగిన సమయంలో తన కుమారుడు వికాస్ కిషోర్ ఇంట్లో లేడని చెప్పారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, ఇది చట్ట ప్రకారం కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతదేహం లభ్యం కావడం, ఆ తుపాకీ తన కుమారుడు వికాస్ కిషోర్ దే అంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్పందిస్తూ.. అది తన కుమారుడిదేనని స్పష్టం చేశారు. వికాస్ కిషోర్ లేడని, అతడి స్నేహితులు మాత్రమే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.


'పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విడిచిపెట్టరు. సంఘటన జరిగినప్పుడు వికాస్ కిషోర్ ఇంట్లో లేడు. సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న వికాస్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవాస్తవ మృతి గురించి తెలుసుకున్న వికాస్ చాలా బాధపడ్డాడు. చనిపోయిన శ్రీవాస్తవ.. నా కొడుకు వికాస్ కు మంచి స్నేహితుడు' అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. 


Also Read: Hottest Month August: ఆగస్టులో ఎప్పుడూ చూడనంత వేడి, 122 ఏళ్లలో తొలిసారి ఇలా - IMD కీలక విషయాలు వెల్లడి


'కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో నా సోదరుడు వినయ్ శ్రీవాస్తవ్ హత్యకు గురయ్యాడు. నా సోదరుడు వికాస్ కిషోర్ కు స్నేహితుడు. ఘటన జరిగినప్పుడు ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. కానీ వికాస్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు వికాస్ కిషోర్ లైసెన్స్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు' అని మృతుడు శ్రీవాస్తవ సోదరుడు మీడియాతో తెలిపాడు.