Maharshtra NCP Crisis:
ఏడాదిగా సంప్రదింపులు..
మహారాష్ట్ర రాజకీయాల్లో రెండేళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే మహారాష్ట్ వికాస అఘాడి చీలిపోవడం మొదలైంది. ఇప్పుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో పూర్తిగా కుప్ప కూలిపోయింది. ఇది ఊహించని మలుపు అందరూ అనుకుంటున్నప్పటికీ...దాదాపు ఏడాదిగా సీక్రెట్‌గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. శిందేతో పాటు బీజేపీతోనూ అనేక చర్చల తరవాత పక్కా ప్లాన్ ప్రకారం...అజిత్ పవార్ NCP నుంచి బయటకు వచ్చేశారు. శిందే ప్రభుత్వంలో చేరి డిప్యుటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో సహా మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లంతా NCPలో కీలక నేతలే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా తిరుగుబాటు చేసిన వాళ్లలో ఉన్నారు. శరద్ పవార్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలందరూ శిందే ప్రభుత్వంలో చేరడం షాక్‌కి గురి చేసింది. నిజానికి అజిత్ పవార్ ఇలా చేయడం కొత్తేం కాదు. 2019లోనూ బీజేపీకి దగ్గరయ్యారు. అయితే కొన్నాళ్ల తరవాత శరద్ పవార్ ఎలాగోలా ఆయనను మళ్లీ వెనక్కి రప్పించారు. కానీ ఈ సారి మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారు అజిత్ పవార్. సరిగ్గా ఏడాది క్రితం శిందే ఎలాగైతే చేశారో...అదే స్టైల్‌లో NCPకి ఝలక్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక్కటే తేడా ఉంది. శిందే పార్టీని చీల్చితే..అజిత్ పవార్ మొత్తం పార్టీనే శిందే వర్గంలోకి తీసుకొచ్చారు. NCP మొత్తం శిందే వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
తీవ్ర అసంతృప్తి..
పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపంతోనే అజిత్ పవార్ NCPని వీడినట్టు తెలుస్తోంది. అజిత్ పవార్‌కి సెపరేట్‌గా ఓ వర్గం కూడా ఉంది. అంటే పార్టీలోనే ప్రత్యేకంగా ఓ గ్రూప్ ఏర్పడింది. ఇది గమనించే శరద్ పవార్ మందలించినట్టు సమాచారం. రాజీనామా చేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అప్పటి నుంచే NCPలో అనూహ్య మార్పులు తప్పవన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడవి నిజమయ్యాయి. సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ప్రకటించడంపై అజిత్ పవార్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏడాదిగా శిందే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్న అజిత్ పవార్...ఇటీవల శరద్ పవార్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయగానే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆయన రాజీనామాని అంగీకరించి కొత్త వారికి నాయకత్వం వహించే అవకాశమివ్వాలని అన్నారు. తనకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్‌నీ శరద్ పవార్ ముందుంచారు. కానీ...అది సాధ్యం కాలేదు. జులై 1 వ తేదీ వరకూ చూస్తానని తానే హైకమాండ్‌కి గడువు ఇచ్చినట్టు సమాచారం. అప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల శిందే వర్గంలో చేరిపోయి కీలక పదవిని చేపట్టారు అజిత్ పవార్. దీనిపై శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి తనకేం కొత్త కాదని, పార్టీని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. జులై 6వ తేదీన పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చారు.
Also Read: మహారాష్ట్ర పాలిటిక్స్‌పై బీజేపీ మాస్టర్ స్ట్రోక్, రెండేళ్లలో మారిపోయిన సీన్