PM Modi Residence: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. న్యూఢిల్లీలోని హై సెక్యూరిటీ, నో ఫ్లయింగ్ జోన్‌లో ఉన్న ప్రధాని ఇంటిపై సోమవారం రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు తెలుస్తోంది. ప్రధాని ఇంటిపై ఏదో ఎగురుతున్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి.. సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే భద్రతా సంస్థలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు.


ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతుందని సమాచారం అందుకున్న ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) దర్యాప్తు ప్రారంభించింది. అయితే డ్రోన్ కానీ, ఎగుర వేసింది ఎవరు వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చున్నారు. డ్రోన్ ఎగిరిన సమయంలో ప్రధాని మోదీ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనతో ప్రధాని మోదీ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రధాన మంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది. అలాగే ఈ ప్రాంతం మొత్తం నో ఫ్లయింగ్ జోన్‌లోకి వస్తుంది.