మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేపై ట్రావెలర్ బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 4 నెలల చిన్నారి సహా 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 






గుడికి వెళ్లి వస్తుండగా


నాసిక్ జిల్లాలోని ఇందిరానగర్ కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం అనంతరం తిరుగు పయనమయ్యారు. మరోవైపు, శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేపై ఉన్న వైజపూర్ టోల్ బూత్ సమీపంలోని పలు వాహనాలను ఆర్టీవో నిలిపేశారు. ఈ క్రమంలో యాత్రికులతో వెళ్తున్న ట్రావెలర్ బస్సు, ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. మినీ బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 4 నెలల చిన్నారి సహా 12 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 


ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఆర్ఎఫ్ కింద రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామన్నారు. 






ఇక్కడ తరచూ ప్రమాదాలు


ఈ ఎక్స్ ప్రెస్ వేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 729 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయని, అందుకే డ్రైవర్లు నిద్రమత్తుతో ప్రమాదాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారణం ఏదైనా ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉందని చెప్పారు.


తమిళనాడులోనూ


తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరుకు వెళ్తున్న కారు తిరువన్నమలై జిల్లాలోని చెంగమ్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.