Maharashtra Political Crisis : మహారాష్ట్రలో సంక్షోభం మరింత ముదురుతోంది. తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన కోరనుందన్న సమాచారం. దాదాపు 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్ చేయనుందని తెలుస్తోంది. అసోం గౌహతిలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే సంఖ్య 40కి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇవాళ అనర్హత దరఖాస్తుకు దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో చిక్కుకోకుండా అసెంబ్లీలో సేనను చీల్చేందుకు ఏక్నాథ్ షిండే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే వర్గంలో ఇప్పటికే 37 ఎమ్మె్ల్యేలు ఉన్నట్లు సమచారం. మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం చేరుతారని తెలుస్తోంది. 


డిప్యూటీ స్పీకర్ నిర్ణయం కీలకం 


బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనకు ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహించారు. గతంలో శివసేనలో చీలికలు వచ్చాయి. అయితే తాజా తిరుగుబాటుతో శివసేన మరింత బలహీనం కానుంది.  తిరుగుబాటు శిబిరంలోని ఉన్న ఎమ్మెల్యే్ల్లో 17 మంది తిరిగి మళ్లీ ఎన్నికల్లో నిలిచే అవకాశం ఉందని మహా వికాస్ అఘాడీ గతంలో ప్రకటించింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అనర్హత వేటు దరఖాస్తు తిరుగుబాటుదారులను అడ్డుకుంటుందనే భావిస్తుంది. షిండే క్యాంపు నుంచి ఏదైనా ప్రపోజల్ వచ్చేలోపు డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. 


ప్రభుత్వంపై శరద్ పవార్ ధీమా 


ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం అఘాడీ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు. "ఎవరికి మెజారిటీ ఉందో ఫ్లోర్ టెస్ట్ నిర్ణయిస్తుంది" అని పవార్ విలేకరులతో అన్నారు. "శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను గుజరాత్‌కు, ఆపై అసోం ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. వారికి సహాయం చేస్తున్న వారందరి పేర్లను మనం తీయాల్సిన అవసరం లేదు. అసోం ప్రభుత్వం తిరుగుబాటు నేతలకు సహాయం చేస్తోంది. 


డిప్యూటీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు 


శివసేన రెబల్ లీడర్‌ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు స్థిరంగా ఉంటారో చూడాల్సి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర డిప్యుటీస్పీకర్ నరహరి జిర్వాల్. షిండే తనకు ఓ లేఖ పంపారని, అందులో 34 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయని చెప్పారు. అయితే ఈ 34 మంది సంతకాలను మరోసారి వెరిఫై చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు జిర్వాల్. ఇందుకు కారణాన్నీ వివరిస్తున్నారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యేలందరూ ఇంగ్లీష్‌లోనే సంతకం చేసినట్టు షిండే చెప్పారట. అయితే ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ సంతకం మాత్రం మరాఠీలో ఉందని చెబుతున్నారు జిర్వాల్. అంటే ఎక్కడో ఏదో మతలబు ఉందని, అదేంటో తేలాలని అంటున్నారు. మిగతా అందరి ఎమ్మెల్యేల సంతకాలనూ మరోసారి చెక్ చేస్తానని స్పష్టం చేశారు.