Chandrapur Bridge Collapse: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్ ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్లాబ్‌లు కూలడంతో ప్రయాణికులు ట్రాక్ పై పడిపోయారు. ఈ ప్రమాదంలో 13 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బల్లార్షా రైల్వే స్టేషన్లోని 1, 2 ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రీ-కాస్ట్ స్లాబ్ ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన ప్రయాణికులు
పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పూణే వెళ్లే రైలు ఎక్కేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి రావడంతో దానిలోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో కొందరు ప్రయాణికులు సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఆ ట్రాక్‌లపై రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి రూ.లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించింది. గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పలు ఆసుపత్రులకు తరలించామని సీపీఆర్వో సీఆర్ శివాజీ సుతార్ తెలిపారు. ఇటీవల గుజరాత్‌లోని మచ్చు నదిపై మోర్బి 'వ్రేలాడే' సస్పెన్షన్ ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోయి 135 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశాలు
చంద్రాపూర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని బల్లార్షా రైల్వే జంక్షన్ లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు పుణె వెళ్లే రైలు ఎక్కేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి ఒక్కసారి రావడంతో బ్రిడ్జిలోని కొంత భాగం కిందకు కూలిపోయిందన్నారు. మిగతా వంతెనంతా బాగానే ఉందన్నారు. దీంతో 20 అడుగుల ఎత్తు నుంచి కొందరు ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పై జారిపడిపోయారని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా, వారిని బల్లార్‌పూర్ గ్రామీణ ఆస్పత్రికి తరలించామన్నారు. వీరిలో కొందరిని చంద్రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక అధికార యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని చంద్రాపూర్ జిల్లా కలెక్టర్ వినయ్ గౌడ తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం సహాయం అందించాలని మంత్రి సుధీర్ మునంటివార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.