NCP Leader Baba Siddique Murder Case: ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ హత్యకు గురయ్యారు. తన కుమారుడి ఆఫీసుకు వెళ్లిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాబా సిద్ధిక్‌పై శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కొన్ని బుల్లెట్లు ఆయన ఛాతీలోకి చొచ్చుకెళ్లాయి. ఘటన జరిగిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబా సిద్ధిక్ మృతి చెందారని వైద్యులు తెలిపారు. 


మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ పై కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ముగ్గురు నిందితులు ఆయన హత్యకు ప్రయత్నించారని, వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. బాబా సిద్ధిక్ పై కాల్పులకు ఉపయోగించిన 9.9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.






బాబా సిద్ధిక్‌ను ఎలాగైనా సరే హత్య చేయాలన్న లక్ష్యంతోనే నిందితులు నేరుగా ఆయన ఛాతీపై కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఎన్సీపీ నేత మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన అనంతరం ఫోరెన్సిక్ టీమ్ అక్కడికి చేరుకుని నిందితులు కాల్చిన బుల్లెట్ లను, ఇతర ఆధారాలను సేకరించింది. 


బాబా సిద్ధిక్‌కు బెదిరింపు లేఖ
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌కు రెండు వారాల కిందట బెదిరింపు లేఖ వచ్చింది. ఈ హెచ్చరికలతో పోలీసులు ఎన్సీపీ నేతకు భద్రతను సైతం పెంచారు. కానీ ఆయనకు భద్రత పరంగా ఏ కేటగిరి సెక్యూరిటీని ప్రత్యేకంగా కల్పించలేదు. బాబా సిద్ధిక్ మరణంతో వారం రోజుల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు నేతలు బైకుల్లాకు చెందిన సచిన్ కుర్మీ, బాబా సిద్ధిక్‌ మరణించారు.



అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి చెందిన బాబా సిద్ధిఖీపై ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో శనివారం గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. నిర్మల్ నగర్‌లోని కోల్‌గేట్ సమీపంలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ ఆఫీసుకు వెళ్లిన సమయంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ చనిపోయారని ఓ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు.


కఠిన చర్యలు తీసుకుంటామన్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే 
మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. చాలా దురదృష్టకర సంఘటన అన్నారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులుకాగా, ఇద్దరు ఉత్తరప్రదేశ్ చెందినవారు, ఒక నిందితుడిది హర్యానా అని పోలీసులు చెప్పారు. మూడో నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం షిండే తెలిపారు.


Also Read: Tragedy Incidents: పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి