ఉన్నత విద్య కోసం ఎన్నో కలలతో క్యాంపస్ లకు వెళ్ళే ఎంతో మంది విద్యార్థులకు ఎదురయ్యే చేదు అనుభవమే ర్యాగింగ్. అలాంటి ఓ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు భాధ పడుతుంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. అందరిలాగే తాను బ్యాగ్ వేసుకొని విద్యార్థిగా కొన్ని నెలలపాటు రోజూ కాలేజీకి వెళ్లింది. స్నేహితులతో మాట్లాడుతూ, క్లాసులకు బంక్ కొడుతూ ర్యాగింగ్ కి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఆ అండర్ కవర్ ఆపరేషన్ వివరాలిలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన 24 ఏళ్ల శాలిని చౌహాన్ అనే లేడీ కానిస్టేబుల్ ఇండోర్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ ను నియంత్రించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం అండర్ కవర్ ఆపరేషన్‌ మొదలుపెట్టారు శాలిని చౌహాన్. ఆమె మూడు నెలలకు పైగా కాలేజీ స్టూడెంట్ గా ఉంటూ ర్యాగింగ్ కు పాల్పడుతున్న 11 మంది సీనియర్ స్టూడెంట్ లను గుర్తించారు. రిపోర్ట్ ఇవ్వడంతో జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను మూడు నెలల పాటు కాలేజీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు.
జూనియర్ స్టూడెంట్స్ ఫిర్యాదులు.. 
శాలిని ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం తరచూ విద్యార్థుల నుంచి ర్యాగింగ్ సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చేవి. మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను విచిత్రమైన పనులు చెయ్యమని సీనియర్ స్టూడెంట్స్ వేధించేవారు. ర్యాగింగ్ చేసి వేధిస్తున్నారని ఎక్కడైనా చెబితే, మరింతగా హింసిస్తామని జూనియర్లను భయభ్రాంతులకు గురిచేసేవారు. దాంతో జూనియర్ స్టూడెంట్స్ ఫిర్యాదు చెయ్యడానికి ర ముందుకు వచ్చే వారు కాదని తెలిపారు. 
"మేము క్యాంపస్ లో తనిఖీ చెయ్యడానికి వెళ్ళాం. పోలీసులు అనే భయంతో మా బట్టలు చూసి విద్యార్థులు భయపడేవారు. ఫోన్ లో ఫిర్యాదు చేసిన వాళ్ల నంబర్ల కోసం ప్రయత్నించాం. కానీ సరైన వివరాలు మాకు లభించలేదు. చేసేదేమీలేక పాత పద్ధతిని అనుసరించాం. శాలిని ఇంకా మిగతా వాళ్ళను సాధారణ వ్యక్తుల్లా క్యాంపస్ దగ్గర తిరగమని, విద్యార్థులతో మాట్లాడమని చెప్పాం. అలా ర్యాగింగ్ కి సంబంధించిన వివరాలు సేకరించి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ సమస్య నుంచి బయడపడేశామని" పోలీసు ఉన్నతాధికారి వివరించారు. 
కానిస్టేబుల్ శాలిని ఏమన్నారంటే.. 
ఈ ఘటనపై కానిస్టేబుల్ శాలిని మాట్లాడుతూ.. కెరీర్ లో ఇది తనకు కొత్త అనుభవం అని, అందరూ స్టూడెంట్స్ లాగ రోజు కాలేజీకి వెళ్లి , క్యాంటీన్ లో అందరితో మాట్లాడానని తెలిపారు. తన గురించి చెప్పడంతో, మిగతా స్టూడెంట్స్ వారి వివరాలతో పాటు సమస్యలు చెప్పేవాళ్లని వెల్లడించారు. మిమ్మల్ని విద్యార్థులు ఎప్పుడు అనుమానించలేదా అని అడగగా "నేను సాధారణ స్టూడెంట్ లా కనిపిచేల జాగ్రత్తలు తీసుకునేదాన్ని. కొన్నిసార్లు తనను సీనియర్ స్టూడెంట్స్ ప్రశ్నించగా.. వాటిని దాటవేసి వేరే అంశాల గురించి మాట్లాడేదాన్ని అని, ఎక్కువగా క్యాంటీన్ లో ఉండటంతో వాళ్ళు ఎక్కువ పట్టించుకునేవారు కాదు" అని తెలిపారు.