LPG Subsidy New Rules: భారత్‌లో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, చమురు విక్రయ సంస్థలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. మీరు గ్యాస్ సబ్సిడీ పొందుతున్నట్టు అయితే వెంటనే మీ మొబైల్ ఫోన్ మెసేజ్‌లను ఒకసారి చెక్ చేసుకోండి. వార్షిక ఆదాయం పది లక్షల పరిమితిని దాటిన వారిని గుర్తించి, వారి సబ్సిడీ తొలగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వం రంగ చమురు సంస్థలు ఇప్పుడు వినియోగదారుల డేటాను ఆదాయపు పన్ను విభాగం రికార్డులతో నేరుగా అనుసంధానిస్తున్నాయి. ఈ ఆటోమేటెడ్ డేటా మ్యాచింగ్ ప్రక్రియ ద్వారా, ఏ కుటుంబాల వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పది లక్షల కంటే ఎక్కువగా ఉందో వారిని గుర్తిస్తున్నారు.
గతంలో సబ్సిడీని వదులుకోవాలని కోరుతూ గివ్ ఇట్ అప్ వంటి స్వచ్ఛంద ప్రచారాలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రూల్స్ అమలులో కఠినంగా వ్యవహరిస్తోంది. అర్హత లేని వారు సబ్సిడీ పొందకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నిబంధన కేవలం గ్యాస్ కనెక్షన్ కలిగిన వ్యక్తి ఆదాయంపైనే కాకుండా, ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయంపై కూడా ఆధారపడి ఉంటుంది. సదరు వినియోగదారుడి వార్షిక ఆదాయం పది లక్షలు దాటినా, గ్యాస్ కనెక్షన్‌తో లింక్ అయి ఉన్న భార్య, లేదా భర్త వంటి కుటుంబ సభ్యుల ఆదాయం పది లక్షల పరిమితిని మించినా సబ్సిడీ నిలిపేస్తారు.
గత ఆర్థిక సంవత్సరంలో మీ స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ాదాయం ఈ పరిమితిని దాటినట్టు ఐటీ రికార్డుల్లో ఉంటే మీరు అనర్హులుగా మారిపోతారు.
ఏడు రోజుల గడవు
రికార్డులతో మ్యాచ్ అయిన వినియోగదారులకు చమురు సంస్థల నుంచి అధికారిక ఎస్‌ఎంఎస్ వస్తుంది. అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం మీ లేదా మీ కుటుంబ సభ్యుడి ఆదాయం పది లక్షల పరిమితిని మించింది. నిర్ణీత సమయంలోగా స్పందించకుంటే సబ్సిడీ నిలిపోతుంది. అని ఆ మెసేజ్ సారాంశం.
మీకు ఈ మెసేజ్ వచ్చినట్టు అయితే కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వ రికార్డుల్లో తప్పు ఉందని, మీరు భావిస్తే వెంటనే సంబంధిత చమురు సంస్థ డిజిటల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ 1800-2333-555కు కాల్ చేసి తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు నిర్ణీత సమయంలోపు స్పందించకపోతే, పహల్ పథకం కింద మీ ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో జమ అయ్యే సబ్సిడీ శాశ్వతంగా నిలిపేస్తారు. అటువంటి వినియోగదారులు భవిష్యత్‌లో మార్కెట్ ధరకే సిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎప్పటి నుంచి అమల్లో ఉంది?
గ్యాస్ సబ్సిడీపై పది లక్షల ఆదాయ పరిమితిని ప్రభుత్వం తొలిసారిగా డిసెంబర్ 2015లో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో ఇది స్వచ్ఛందంగా ఉండేది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న తరుణంలో మే 11న వడోదరలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విలువై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన కోరారు. ప్రజా రవాణా వాడటం, కార్ పూలింగ్ చేయడం, సాధ్యమైనంత వరకు వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయాలని సూచించారు.
