Isro scientist nandini harinath saree:  శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్రగామిగా ఎదుగుతున్న వేళ, ఆ విజయాల వెనుక ఉన్న మహిళా శాస్త్రవేత్తల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  మంగళయాన్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ సైంటిస్ట్ నందిని హరినాథ్ , ఇప్పుడు తన పరిశోధనల వల్లే కాకుండా, ఆమె ధరించిన  చీర కారణంగా కూడా ప్రపంచ వార్తల్లో నిలిచారు.

Continues below advertisement

 అమెరికా మ్యూజియంలో అరుదైన గౌరవం 

అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ఉన్న ప్రసిద్ధ  స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం లో నందిని హరినాథ్ కట్టుకున్న చీరను ప్రదర్శనకు ఉంచారు. ఒక భారతీయ శాస్త్రవేత్త వ్యక్తిగత వస్త్రధారణను అంతర్జాతీయ వైజ్ఞానిక మ్యూజియంలో ప్రదర్శించడం ఇదే మొదటిసారి  . ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పనిచేస్తున్నప్పటికీ, తన మూలాలను, సంస్కృతిని కాపాడుకునే భారతీయ నారీమణికి ఇది దక్కిన అరుదైన గౌరవం.

Continues below advertisement

 ఎవరీ నందిని హరినాథ్? 

నందిని హరినాథ్ ఇస్రోలో గత రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నారు. ఆమె ప్రధానంగా ప్రాజెక్ట్ మేనేజర్ , మిషన్ డిజైనర్‌గా పనిచేశారు. 2013లో భారతదేశం చేపట్టిన  మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్  లో ఆమె డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తక్కువ ఖర్చుతో అంగారక గ్రహంపైకి భారత్ పంపిన ఉపగ్రహం ప్రపంచ రికార్డు సృష్టించడంలో నందిని కృషి ఎంతో ఉంది. ఆమెను భారతదేశపు  రాకెట్ ఉమెన్ అని పిలుస్తారు.        

 

 ఆ చీర వెనుక ఉన్న విశేషం ఏమిటి?                                         

మంగళయాన్ ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన రోజున  సెప్టెంబర్ 24, 2014 , ఇస్రో కంట్రోల్ రూమ్‌లో మహిళా శాస్త్రవేత్తలంతా రంగురంగుల చీరలు కట్టుకుని సంబరాలు చేసుకున్న ఫోటో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆ ఫోటో శాస్త్రవేత్తలంటే గంభీరమైన కోట్లు ధరించేవారే కాదు, సాధారణ భారతీయ మహిళలలాగే ఉంటూనే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించింది. ఆ అద్భుత ఘట్టానికి గుర్తుగా నందిని ధరించిన సిల్క్ చీరను స్మిత్సోనియన్ మ్యూజియం సేకరించి ప్రదర్శనకు ఉంచింది.              ఈ ప్రదర్శన కేవలం ఒక వస్త్రానికి సంబంధించినది కాదు, అది భారతీయ శాస్త్రవేత్తల సంప్రదాయం , ఆధునికత  కలయికను సూచిస్తుంది.  చీర కట్టుకుని కూడా అంతరిక్షంలో జెండా పాతవచ్చు  అనే సందేశం నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా  తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.