Bandi sanjay son bhageerath approaches high court: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు నడుస్తుండటంతో, భగీరథ్ తరపు న్యాయవాదులు అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం, దీనిపై విచారణను మే 14 గురువారం కు వాయిదా వేసింది. ఆ రోజున వెకేషన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వులపై భగీరథ్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది తేలనుంది.
అసలు ఏం జరిగింది? సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై మే 8న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్‌లో మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ వేధింపులు జరిగినట్లు బాధితురాలి కుటుంబం ఆరోపించింది. కాగా, ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్‌లో సదరు బాలిక కుటుంబంపై హనీట్రాప్, బ్లాక్ మెయిల్ ఆరోపణలతో ఎదురు ఫిర్యాదు చేశారు.
సిట్ విచారణ వేగవంతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతున్న తరుణంలో, హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసులో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండటంతో, హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే పెట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
