Ram Mandir Consecration: ఆధ్యాత్మిక వైభవంతో అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) విరాజిల్లుతోంది. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నాటి రాముడి వైభవాన్ని తలపించేలా, కీర్తిని చాటాలే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం శాస్త్రోక్తంగా మొదలయ్యాయి.  ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో ఈరోజు (బుధవారం) కీలకఘట్టం జరగనుంది. బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ‍ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి. 


రామ్‌లల్లా ఉత్సవ విగ్రహ క్రతువులు మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు  అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు చేపట్టారు. అనంతరం అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు.


ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం  ఒంటిగంటకు వివేక్ సృష్టి ప్రాంగణంలో ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి అనిల్ మిశ్రా దంపతులు, శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి, ఇతర పరికరాలను ఉపయోగించారు. విగ్రహాలను రూపుదిద్దే క్రమంలో దేవుడికి గాయం తగిలిందన్న భావనతో క్షమాపణలు కోరుతూ పూజలు చేశారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. అనంతరం అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.


వారి చేతుల మీదుగానే కార్యక్రమాలు
బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు  ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం జరిగే కార్యక్రమాలకు ప్రతినిత్యం వారే ఉభయకర్తలుగా ఉంటారని  అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయోధ్యలో అనుష్ఠానానికి శ్రీకారం చుట్టామని, ఆలయ ప్రాణప్రతిష్టకు దేవుళ్లందరి అనుగ్రహాన్ని అర్థిస్తూ మొత్తం 11 మంది పూజారులు క్రతువులు ప్రారంభించారని ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ తెలిపారు. 


121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.