Viral News: ఇంట్లో వస్తువులను దొంగలించినా, ఇతర వస్తువులను చోరీ చేసినా అవి తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా 100 శాతం రికవరీ అవుతుందన్న గ్యారెంటీ లేదు. నగలు, డబ్బు అయితే వాటి గురించి మర్చిపోవాల్సిందే. బైకులు, కార్లు అంటే వాటి నంబర్లు, చాసిస్ నంబర్లతో వెతకొచ్చు. డబ్బును, నగలను మాత్రం త్వరగా మార్పించే వెసులుబాటు ఉండటంతో వాటి రికవరీ కష్టంగా ఉంటుంది. దొంగతనం కేసులు సంవత్సరాలకు సంవత్సరాలు ఎటూ కదలక ఉన్నవి చాలానే ఉంటాయి. అయితే ఒడిశాలో జరిగిన ఓ ఘటన మాత్రం వీటన్నింటికి భిన్నం.


ఒక దొంగ ఓ ఆలయంలో నగలను చోరీ చేశాడు. ఆ నగలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆ దొంగను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ నగలను రికవరీ చేయలేకపోయారు. ఇక పోయాయేమో అనుకుని ఊరుకున్నారు. చూస్తుండగానే 9 సంవత్సరాలు గడిచాయి. ఉన్నట్టుండి ఒక రోజు ఆ నగలు కనిపించాయి. అందులో ఓ నోట్ కూడా ఉంది. అది చూసిన చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేయడంతోపాటు అంతా ఆ దైవ మహిమ అనుకున్నారు.


Alo Read: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం


అసలేం జరిగిందంటే..?


అది ఒడిశాలోని గోపీనాథ్‌పూర్ లోని గోపీనాథ్ దేవాలయం. ఆ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహానికి ఆభరణాలు ఉంటాయి. ఈ నగలు  చోరీ అయ్యాయి. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇక నగలు దొరకవని భావించి ఊరుకున్నారు. 9 సంవత్సరాల తర్వాత ఒక రోజు గోపీనాథ్ ఆలయం ముందు ఓ మూట కనిపించింది. అందులో శ్రీకృష్ణ భగవానుడి ఆభరణాలతోపాటు 300 రూపాయలు, ఓ చిన్న నోట్ కూడా దొరికింది. ఆ నోట్ రాసిందే ఎవరో కాదు.. ఆ నగలను 9 సంవత్సరాల క్రితం దొంగిలించిన దొంగ. 


దొంగ రాసిన నోట్ లో ఏముందంటే?


'ఈ నగలను 2014లో యాగశాలలో దొంగలించాను. ఈ ఆభరణాలు చూస్తుంటే శ్రీ కృష్ణ భగవానుడివిలా అనిపించాయి. దొంగతనం అయితే చేశాను కానీ అప్పడి నుంచి మనశ్శాంతి లేదు. రోజూ నిద్రలో చెడు కలలు వచ్చేవి. మొదట్లో ఇలాగే ఉంటుందని ఊరుకున్నా. కానీ ఆ చెడు కలలు విపరీతంగా రావడం మొదలైంది. రాత్రిళ్లు నిద్ర కూడా ఉండటం లేదు. మనశ్సాంతి లేదు, నిద్రపోలేక ఇతర ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి. ఆ కలలు నాకేవో చెబుతున్నాయని అనిపించేది.


Alo Read: పొట్ట తగ్గించుకోడానికి సింపుల్ చిట్కా, అప్పడాల కర్రతో అలా చేస్తే సరి - వైరల్ వీడియో


ఈ మధ్యే భగవద్గీత చదివా. అది చదివాక నేను దొంగతనం చేయడం ఎంత పెద్ద తప్పో తెలిసి వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి ఆభరణాలు దొంగతనం చేయడం వల్లే ఇలా జరిగింది. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.300 కూడా ఉంచుతున్నా. శ్రీకృష్ణుడు విధించిన శిక్ష తర్వాత తాను పశ్చాత్తాపం చెందాను. దొంగిలించిన ఆభరణాలను తిరిగి ఇస్తున్నా' అంటూ ఆ దొంగ తన లేఖలో పేర్కొన్నాడు. దొంగతనానికి గురైన స్వామి వారు ఆభరణాలు తిరిగి 9 సంవత్సరాల తర్వాత తన స్థానానికి చేరుకోవడం నిజంగా దైవలీల అని భక్తులు భావిస్తున్నారు. కృష్ణుడు తన నగలను తిరిగి తెప్పించుకున్నాడని అనుకుంటున్నారు.