Loksabha Elections 2024: 


2024 ఎన్నికలపై కామెంట్స్..


దేశవ్యాప్తంగా రాజకీయాలు రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నాయి విపక్షాలు. ఇప్పటికే పట్నా వేదికగా వ్యూహాలూ సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. CBI,ED పేరు చెప్పి బీజేపీ భయపెడుతోందని, అయినా ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదని అన్నారు. నిజం కోసం పోరాటం చేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదు అంటూ జోస్యం చెప్పారు. అప్పుడు మోదీతో పాటు ఆయన అనుచరులనూ ఇన్వెస్టిగేట్ చేయిద్దామంటూ సెటైర్లు వేశారు. 


"నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోండి. మరో ఆర్నెల్లలో ఎలాగో మోదీ ప్రభుత్వం పడిపోక తప్పదు. అప్పుడు ఆ CBI, ED అధికారులకు అర్థమవుతుంది. వాళ్లంతట వాళ్లే వెళ్లిపోతారు. మీరేం చేయాల్సిన పని లేదు. బీజేపీ ఓడిపోయిన తరవాత ఆ పార్టీ నేతల్ని ఇన్వెస్టిగేట్ చేయిస్తే సరిపోతుంది. మోదీతో పాటు ఆయన అనుచరులను, సన్నిహితులపైనా విచారణ జరిపించాలి"


- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ 


పుల్వామా దాడిపైనా వ్యాఖ్యలు..


గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సత్యపాల్ మాలిక్.  పుల్వామాలో భారత సైనికులపై దాడి చేసిన సమయంలో రాజ్‌నాథ్‌సింగ్‌ని తాను హెచ్చరించానని, జీప్‌లో కాకుండా వాళ్లను ఎయిర్‌క్రాఫ్ట్‌లో పంపాలని చెప్పాని అన్నారు. అప్పుడు తన మాట విని ఉంటే అంత మంది సైనికులు చనిపోయే వాళ్లు కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఆ తరవాత వెంటనే సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కి చెందిన ఓ కేసులో సీబీఐ విచారణకు హాజరు కావాలని సత్యపాల్ మాలిక్‌కి నోటీసులు అందాయి. ఇలా కేంద్రంపై విమర్శలు చేశారో లేదో అలా సీబీఐ నోటీసులు వచ్చాయంటూ ప్రతిపక్షాలు ఈ అంశంపై తమ గళాన్ని బలంగా వినిపించాయి. బీజేపీ టైమ్ లోనే నాలుగు రాష్ట్రాలకు సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా పనిచేశారు. 2017-18 బిహార్ గవర్నర్, 2018-19 అక్టోబర్ వరకూ జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగి 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం సత్యపాల్ మాలిక్ ను గోవాకు గవర్నర్ గా నియమించింది. 2019-20 వరకూ గోవా గవర్నర్ గా, 2020 నుంచి 2022 అక్టోబర్ కు మేఘాలయకు గవర్నర్ గా ఉన్నారు సత్యపాల్ మాలిక్. 


Also Read: PM Modi US Visit 2023: భారత్‌లో కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి- అమెరికా ఎన్‌ఆర్‌ఐలకు మోదీ పిలుపు