2000 Rupees Notes: 2 వేల రూపాయల నోట్ల విత్‌ డ్రా ప్రారంభమై సరిగ్గా నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో, చలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్లలో 72% పైగా నోట్లు బ్యాంకులను టచ్‌ చేశాయి. జనం వాటిని డిపాజిట్ చేశారు/చిన్న నోట్లుగా మార్చుకుని తిరిగి తీసుకున్నారు.


2023 మే 19న, రూ.2,000 కరెన్సీ నోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్‌ల్లో మార్చుకోవడానికి 23 మే 2023 నుంచి అనుమతించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా, పింక్‌ నోట్లను బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేయడం లేదా మార్చుకోవచ్చు. 


2023 మార్చి చివరి నాటికి, భారతదేశంలో రూ.3.7 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2 వేల నోట్ల వాటా 10.8%. 


పింక్‌ కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. కాబట్టి, ఇప్పటికీ రూ.2000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీనే. వాటిని బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అన్ని రకాల కొనుగోళ్ల కోసం జనం వాడుతున్నారు. 


వాస్తవానికి, 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ తర్వాత డిజిటల్‌ ట్రాన్జాక్షన్లు కొద్దిగా తగ్గాయి. చాలా వస్తువులు, సర్వీస్‌లను క్యాష్‌తోనే కొంటున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకున్న వారిలో దాదాపు 75 శాతం మంది రూ.2,000 నోట్లతోనే పేమెంట్స్‌ చేస్తున్నారు. 


నోట్లు తీసి చేతిలో పెడుతున్న జనం
పెట్రోల్ పంపుల్లోనూ క్యాష్‌ డీలింగ్స్‌ వేగంగా పెరిగాయి. ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తున్న బండి ఓనర్లు, బిల్లు చెల్లించడానికి రూ.2000 నోట్లను ఉపయోగిస్తున్నారు. గతంలో, పెట్రోల్‌ బంకుల్లో డైలీ విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ 40 శాతం ఉంటే, ఇప్పుడు 10 శాతానికి తగ్గాయి. SBI రిపోర్ట్‌ ప్రకారం.. ఈ-కామర్స్, ఫుడ్‌, ఆన్‌లైన్ కిరాణాల్లో ఆర్డర్లు పెట్టి, క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకునే కస్టమర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 వేల నోట్లను దేవాలయాలు & ఇతర మత సంస్థలకు విరాళాలుగా ఇస్తున్నారు. 


లగ్జరీ కోసం రూ.2 వేల నోట్లు
బంగారం, వజ్రాభరణాలు, ACలు, ఖరీదైన మొబైల్ ఫోన్‌లు, లగ్జరీ ఫర్నీచర్‌ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం పింక్‌ నోట్లను పదేపదే ఉపయోగిస్తున్నారు. రేటెక్కువ అంటూ గతంలో నసిగిన వాళ్లు కూడా ఇప్పుడు సెకండ్‌ థాట్‌ లేకుండా సీరియస్‌గా కొంటున్నారు. ఇళ్లు, స్థలాల వంటి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో 2000 రూపాయల నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. ఈ తరహా ఖర్చులు ఇంకా పెరుగుతాయని ఎస్‌బీఐ రిపోర్ట్‌ అంచనా వేసింది. 


స్టేట్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌ ప్రకారం... దాదాపు రూ.3.08 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వస్తాయి. అందులో రూ.92 వేల కోట్లు సేవింగ్స్‌ అకౌంట్లలో జమ అవుతాయి. ఈ డబ్బులో ఎక్కువ భాగాన్ని 2 వేల రూపాయల నోట్ల మార్పిడి కోసం జమ చేస్తారు తప్ప, అకౌంట్లలోనే ఉంచడానికి కాదు. కాబట్టి, అందులో 60 శాతం మొత్తాన్ని, అంటే దాదాపు రూ. 55,000 కోట్లను ప్రజలు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. వాటిని తిరిగి ఖర్చు పెట్టవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. దీర్ఘకాలంలో ఇది రూ.1.83 లక్షల కోట్లకు చేరొచ్చని లెక్కగట్టింది. దీనివల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.


మరో ఆసక్తికర కథనం: ఇండియాలోకి 'ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌'‌ - పూర్తిగా ఫ్రీ + బోల్డెన్ని బెనిఫిట్స్‌ 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial