Varahi Yatra :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి పది రోజులు అవుతోంది. పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా ఎవరూ జన సమీకరణ చేయాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్. అదీ గోదావరి జిల్లాల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన వారందరూ ఓట్లేస్తారా లేదా అన్నదానిపై పవన్ కల్యాణ్ తనకు తానే సెటైర్లు వేసుకున్నా.. ఆయన జనాకర్షణ మాత్రం మాస్. అయితే గతంలోలా కాదు .. ఈ సారి ఆయన  వారాహి యాత్ర రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ఆయనను  ఓ సామాజికవర్గానికి పరిమితం చేయాలని.. ఆయనకు మద్దతు ఉంటుందని భావిస్తున్న వర్గంలో చీలిక కోసం ఇలాంటి ఎదురుదాడి వైసీపీ చేస్తోందన్న భావన బలంగా ఏర్పడుతోంది. 


ద్వారంపూడిపై పవన్ విమర్శలను కాపు రాజకీయానికి మళ్లించిన ముద్రగడ 


జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రౌడీయిజం చేస్తారని ఆయన ఆటలు సాగనివ్వబోమని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రకటించారు. దీనిపై ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. తనపై కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేశారు. అది వారిద్దరి అంశం. అయితే హఠాత్తుగా ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చారు. ద్వారంపూడి కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి ఆర్థిక సాయం చేశారని ఆయనను విమర్శించడం కరెక్ట్ కాదని పవన్ పై డైరక్ట్ గా విమర్శలు చేశారు. నిజానికి సోషల్ మీడియాలో ఎవరో తనను ఏదో అన్నారని ఇక కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని విరమించుకుంటున్నానని ముద్రగడ ప్రకటించారు. ఇప్పుడు పవన్ ను విమర్శించడానికి అదే హోదాలో తెరపైకి  రావడం లేఖ రాయడం సంచలనం అయింది. అంతే కాదు.. ద్వారంపూడి చెప్పినట్లుగా కాకినాడలో పోటీ చేయాలని లేకపోతే పిఠాపురంలో పోటీ చేసి తనను పోటీకి రావాలని సవాల్ చేయాలని ఆయనంటున్నారు. 


కాపుల్లో చీలిక కోసం వైఎస్ఆర్‌సీపీ పాచికగా రాజకీయవర్గాల అంచనా 


పవన్ వారాహి యాత్ర ప్రభావం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అది కాపు ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తుందన్న రిపోర్టులు రావడంతోనే వైఎస్ఆర్సీపీ  అగ్రనాయకత్వం పవన్ పై కాపు కోణంలో ఎదురుదాడి ప్రారంభించిందని అంటున్నారు. వైసీపీ కాపు మంత్రులందరూ యాత్ర ప్రారంభించినప్పటి నుండి తవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ అవి ఎప్పుడూ చేసేవే. ముద్రగడ ఇంకా అధికారికంగా వైసీపీలో చేరలేదు. పైగా ఆయనకు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్ర ఉంది. ఆయన ద్వారా పవన్ పై ఎటాక్ చేయిస్తే.. కాపుల్లో చీలిక వస్తుందన్న వ్యూహంతోనే ముద్రగడను రంగంలోకి దించారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీలోని కాపు నేతలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.  ఆయనకు సొంత వర్గంలో ఎంత మద్దతు తగ్గించగలిగితే అంత వైసీపీకి ప్లస్ అనే భావన రావడంతో చివరికి పోసాని కృష్ణమురళి లాంటి వారిని కూడా రంగంలోకి దించి.. ముద్రగడకు మద్దతుగా మాట్లాడిస్తున్నారని అంటున్నారు. 


కాపులంతా తన వెంట ఉండేలా చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు


ప్రజారాజ్యం సమయంలో కానీ.. జనసేన గత ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్న సమయంలో కానీ.. కాపుల మద్దతు పూర్తి స్థాయిలో రాలేదన్న అభిప్రాయం ఉంది. టీడీపీకి కమ్మ సమాజికవర్గం.. వైసీపీకి రెడ్డి సామాజికవర్గం అండ ఉంటందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా ఏ వర్గం అండ లేకపోబట్టే.. బీజేపీ పుంజుకోలేకపోతోంది. పవన్ కు.. కాపు వర్గం అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం పవన్ గట్టి నమ్మకం కల్పించాల్సి ఉంది. ఆ నమ్మకం కల్పించడానికే పవన్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం సక్సెస్ అయితే జనసేనకు సాలిడ్ ఓటు బ్యాంక్ వస్తుంది. అలా వస్తే కర్ణాటకలో జేడీఎస్ తరహాలో రాజకీయాలు చేయవచ్చు. 


అయితే కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ వైపు కన్సాలిడేట్ అయితే.. వైసీపీకి ఇబ్బంది అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే.. ఇప్పుడు కాపు ఓట్లను చీల్చే లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే .. వైసీపీపై వ్యతిరేకత భారీగా ఉన్నందున ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల .. పవన్ వైపు కాపు వర్గం మొత్తం ఏకం అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ పై రాజకీయ దాడి వ్యూహాలు చూస్తే వారాహి యాత్ర సంచలనం సృష్టిస్తోందని వారు లెక్కలేసుకుంటున్నారు. 





Join Us on Telegram: https://t.me/abpdesamofficial