అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. తన మూడు రోజుల పర్యటనలో లభించిన ప్రేమాభిమానాలకు మీరే కారణం అంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను మోదీ వివరించారు. భారత్‌ అమెరికా మధ్య స్నేహ బంధంలో కొత్త ప్రయాణం మొదలైందన్నారు. 


రోనాల్డ్ రీగన్ సెంటర్‌కు వచ్చిన భారతీయులంతా ఆ ప్రాంతాన్ని మినీ భారత్‌లా మార్చేశారని ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అందమైన చిత్రాన్ని చూపించిన వారికి ధన్యావాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లడంలో ఆయనదే కీలక పాత్ర అన్నారు. 






రక్షణ ఒప్పందాలు భారత్, అమెరికా సుస్థిరం చేశాయన్నారు. మోదీ. మేం ఒప్పందాలు, అగ్రిమెంట్స్ మాత్రమే చేసుకోవడం లేదు. జీవితాలను, కలలను, లక్ష్యాలను మార్చబోతున్నామని వివరించారు. నేటి భారత్‌ సాధిస్తున్న ప్రోగ్రెస్‌కు 140 కోట్ల మంది ఆత్మవిశ్వాసమే కారణమని అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల నుంచి భారత్‌లో జరుగుతున్న డిజిటలైజేషన్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుందని కితాబు ఇచ్చారు. 


అమెరికా ప్రగతిలో మీరంతా(ఎన్‌ఆర్‌ఐ) కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ ప్రశంసించారు. ఇప్పుడు భారత్‌లో కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి దేశ ప్రగతికి సాయపడాలని కోరారు. భారత్‌ నుంచి ఎప్పుడో తీసుకెళ్లిపోయిన 100 పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపారు. సెంటిమెంట్స్‌ను గౌరవించినందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మన దేశ ఉన్నతి ప్రపంచానికి చాటి చెప్పబోతోందన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లైతే... ఆధునిక ప్రజాస్వామ్యానికి అమెరికా ఛాంపియన్ లాంటిందన్నారు. ఈ రెండు దేశాల ఒప్పందాలపై ప్రపంచం ఆతృతగా చూస్తోంది.






భారత్‌లో ఫైటర్ జెట్ ఇంజిన్లు తయారు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. బోయింగ్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లో పెట్టనుందని వివరించారు. నాసాతో కలిసి భారత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే చర్చ కూడా ఊపందుకుందన్నారు. 


ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ 
ఈ ఏడాది సియాట్రోలో భారత్ కొత్త కాన్సులేట్ ప్రారంభించబోతోందని మరో రెండు నగరాల్లో కూడా కాన్సులేట్లు స్టార్ట్ చేయబోతున్నట్టు మోదీ చెప్పారు. అహ్మదాబాద్, బెంగళూరులో అమెరికా కాన్సులేట్లు ప్రారంభం కానున్నాయన్నారు. హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం భారతీయులు అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలియజేశారు. 


నాటు నాటు ప్రస్తావన
'మీరు ఇక్కడ మీ పనిలో బిజీగా ఉన్నారు. కానీ మీ హృదయం మాత్రం ఇండియాలోనే ఉందని నాకు తెలుసు. ప్రపంచం మొత్తం నాటు-నాటు పాటకు నృత్యం చేస్తున్నప్పుడు మీకు గర్వంగా అనిపిస్తుంది. అని మోదీ అన్నారు.