Lok Sabha Election 2024 Phase 2 Voting Updates: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ పూర్తయింది. ఈ విడతలో మొత్తం 60 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ నియోజకవర్గాల్లో నేడు (ఏప్రిల్ 26) రెండో విడత పోలింగ్ జరిగింది. వీటిలో అత్యధికంగా త్రిపురలో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 77.93 శాతం మంది ఓట్లు వేయగా.. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన ఛత్తీస్ గఢ్ లో 72.13 శాతం, మూడు సీట్లలో పోలింగ్ జరిగిన పశ్చిమ బెంగాల్ లో 71.84 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు, మణిపూర్ లో 13 పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా 76.06 శాతం నమోదైంది. అసోంలో కూడా సాయంత్ర 5 గంటలలోపు 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మహారాష్ట్రలో కేవలం 53.51 శాతం మాత్రమే పోలింగ్ లో ప్రజలు పాల్గొన్నారు.
రెండో విడత ఈ రాష్ట్రాల్లోనే
రెండో విడత పోలింగ్ లో భాగంగా కేరళలో 20 సీట్లు, కర్ణాటకలోని 14 స్థానాలు, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర 8, ఉత్తర్ ప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 7, అసోంలో 5, బిహార్ 3, ఛత్తీస్ గఢ్ 3, వెస్ట్ బెంగాల్ 3, మణిపూర్, త్రిపుర, జమ్ము కశ్మీర్ లో ఒక్కో స్థానం చొప్పున రెండో విడతలో పోలింగ్ పూర్తయింది. మొత్తం ఏడు విడతల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం మొదటి విడత ఎన్నికలు జరగ్గా.. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజకవర్గా్లలో పోలింగ్ జరిగింది.మొదటి విడతలో దాదాపు 65.5 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ రెండో విడత పోలింగ్ లో ప్రముఖులైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తేజస్వీ సూర్య, హేమ మాలిని, అరుణ్ గోవిల్, రాహుల్ గాంధీ, శశిథరూర్, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్, హెచ్‌డీ కుమార స్వామి తదితరుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.