BJP Releases Second Candidates List Karnataka CM Basavaraj Bommai Nitin Gadkari: న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఇదివరకే తొలి జాబితా విడుదల చేసింది. తాజాగా బుధవారం (మార్చి 13న) 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా (BJP 2nd Candidates List) విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేయగా, రెండో జాబితాలో బీజేపీ అధిష్టానం మరో 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచింది.






ఇప్పటివరకూ 267 మంది అభ్యర్థుల ప్రకటన 
రెండు జాబితాలలో కలిపి బీజేపీ ఇప్పటివరకూ 267 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తాజా జాబితా పరిశీలిస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నాగ్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, హవేరీ నుంచి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, బెంగళూరు సౌత్‌ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.


కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉత్తరాఖండ్ లోని గర్హవాల్ నుంచి అనిల్ బలూని, కర్ణాల్ నుంచి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అంబాలా నుంచి బాంటో కటారియా, గురుగ్రామ్ నుంచి రావు ఇంద్రజిత్ సింగ్ యాదవ్, ఫరీదాబాద్ నుంచి క్రిషన్ పాల్ గుర్జార్, సిర్సా నుంచి అశోక్ తన్వర్, భివానీ- మహేంద్రగఢ్ నుంచి ధరంబీర్ సింగ్,   ఫరీదాబాద్ నుంచి క్రిష్ణన్ పాల్ గుర్జార్ లకు ఛాన్స్ ఇచ్చింది.


సోమవారం జరిగిన CEC సమావేశంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఆ సమావేశానికి ముందే అభ్యర్థుల రెండో జాబితా సిద్ధం చేసుందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రాల నేతలతో వరుస భేటీ అయి చర్చలు జరిపారు.


నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్ సింగ్ 
తొలి జాబితాలో ప్రధాని మోదీ వారణాసి నుంచి, అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భోపాల్‌లోని గుణ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్థానాలు ప్రకటించారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ.. వివాదాల కారణంగా లోక్‌సభ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తన తల్లికి, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూపీలోని బారాబంకి నియోజకవర్గం నుంచి ఛాన్స్ దక్కించుకున్న బీజేపీ నేత ఉపేంద్ర రావత్ పోటీ నుంచి వైదొలిగాలని నిర్ణయం తీసుకున్నారు.






తెలంగాణ నుంచి వీరికి ఛాన్స్
మహబూబ్ నగర్‌ - డీకే అరుణ
ఆదిలాబాద్ -  గోడం నగేష్‌
నల్లగొండ -  సైదిరెడ్డి
మహబూబాబాద్ - సీతారామ్ నాయక్ 
మెదక్ - రఘునందన్ రావు
పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్