ABP Cvoter Opinion Poll: మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరగనున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ సందడి మొదలైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టింది మోదీ సర్కార్. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే ABP News CVoter Opinion Poll నిర్వహించింది. ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో అడిగి తెలుసుకుంది. ఈ సర్వే (ABP Cvoter Opinion Poll 2024) ప్రకారం..బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిదే హవా కనిపించనుంది. మొత్తం రాష్ట్రంలో 14లోక్‌సభ స్థానాలుండగా 12 చోట్ల NDA విజయం సాధిస్తుందని అంచనా వేసింది. I.N.D.I.A కూటమి రెండు స్థానాలకే పరిమితం కానుంది. ఇక ఓటు షేర్ ఆధారంగా చూస్తే...NDA కి 45% ఓట్లు పోల్ అయ్యే (Lok Sabha Elections Opinion Poll 2024) అవకాశాలున్నాయని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. I.N.D.I.A కూటమికి 38% ఓట్లు, AIUDFకి 13% ఓట్లు పోల్ అయ్యే అవకాశాలున్నాయి. 2021 లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 75 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిని పక్కకు నెట్టి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. 



హరియాణాలోనూ బీజేపీదే హవా..


హరియాణాలో ప్రస్తుతం రాజకీయాలు నాటకీయంగా మారిపోయాయి. మనోహర్ లాల్‌ ఖట్టర్ రాజీనామా చేయడం ఆ తరవాత నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్షలోనూ నెగ్గారు. అయితే..సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు జరగడం ఉత్కంఠ రేపింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి మరింత పెరిగింది. దీనిపైనే ABP సీఓటర్ ఒపీనియన్ పోల్‌ సర్వే చేపట్టింది. బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8 చోట్ల బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మిగతా రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలున్నట్టు తెలిపింది. 


కర్ణాటకలో పరిస్థితేంటి..?


కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka Lok Sabha Elections) అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. అయితే..లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఈ సీన్‌ రివర్స్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ఇదే విషయం వెల్లడించింది. మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో NDA 23 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 5 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఓట్ల పరంగా చూస్తే...NDAకి 53% ఓట్లు పోల్ అవుతాయని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కి 42% ఓట్లు వచ్చే అవకాశముంది. ఈ సారి బీజేపీ-జేడీఎస్ కలిసి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చే అవకాశముందని ఈ ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు సాధిస్తే ఆ పార్టీకి మంచి జోష్ రావడం ఖాయం.