లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.  విపక్ష పార్టీల కూటమి ఫ్లోర్ లీడర్ సమావేశంలో అందరూ రాహుల్ గాంధీ పేరును ఎంపిక చేసినట్లుగా వేణుగోపాల్ వెల్లడించారు. లోక్ సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరును తాము ఖరారు చేసినట్లుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రోటెమ్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ రాశారు.






I.N.D.I.A కూటమిలోని విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం మంగళవారం (జూన్ 25) ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇంట్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరేక్ ఓ బ్రెయిన్, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ నేత హనుమాన్ బెనివాల్ సహా ఇతర కూటమి పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు.


‘‘I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకే గత లోక్ సభ ఎన్నికల్లో 99 సీట్లు వచ్చాయి. అందులో రాహుల్ గాంధీ పాత్ర ఎంతో ఉంది. అందుకే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉంటే బావుంటుందని మేం నిర్ణయించాం’’ అని శివసేన (యూబీటీ వర్గం) నేత ఆనంద్ దూబే అన్నారు.


రాహుల్ గాంధీ గత ఐదు పర్యాయాల నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం రాయ్ బరేలీ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన ఎంపీగా మంగళవారం (జూన్ 25) చేతిలో రాజ్యాంగం పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీ్ల్లో కెల్లా అత్యధిక స్థానాలున్న పార్టీగా నిలిచింది. గత పదేళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి ఆ హోదా దక్కింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో కనీసం 10 శాతం ఓట్లు కూడా లేవు. నిజానికి రాహుల్ గాంధీ గత వారం క్రితమే లోక్ సభలో విపక్ష నేత విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఖర్గే సహా మితా వారు ఆదేశిస్తే తను ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తానని అన్నారు.