e-Tickets Booking News: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) లో పర్సనల్ అకౌంట్ల ద్వారా సొంతంగా కాకుండా ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే నేరం అంటూ రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలు అసత్యమని ఐఆర్‌సీటీసీ కొట్టిపారేసింది. కనీసం బంధువులు, ఫ్రెండ్స్‌కి ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్‌ చేసినా జైలు శిక్ష, జరిమానా పడుతుందంటూ వస్తున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఇవి ప్రజల్ని తప్పదోవపట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది. 


నెలవారీ బుకింగ్ లిమిట్


స్టాండర్డ్ యూజర్లు: వీరు పర్సనల్ IRCTC వినియోగదారు ఐడీని వాడి నెలకు గరిష్ఠంగా 12 టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.


ఆధార్-అథంటికేటెడ్ యూజర్లు: వీరు వీరి యూజర్ ఐడీని ఆధార్‌తో అథంటికేట్ చేసి ఉన్నట్లయితే, నెలకు 24 టిక్కెట్‌ల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రతి టిక్కెట్‌పై కనీసం ఒక ప్రయాణీకుడు కూడా ఆధార్ అథంటికేషన్ ఉండాలి. ఆధార్-అథంటికేటెడ యూజర్ల కోసం వారికి మరింత సౌలభ్యం కలిగించడం కోసమే ఈ లిమిట్‌ను పెంచారు. ఉమ్మడి కుటుంబాలు లేదా గ్రూపుల వారీగా టికెట్లు బుక్ చేయడం కోసం ఇది సౌకర్యంగా ఉంటుంది.


ఇది నేరం
పర్సనల్ ఐడీ నుంచి టికెట్లు బుక్‌ చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం నేరం అని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్‌ పార్టీ బుకింగ్‌ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుంది. వారు మాత్రమే టికెట్లు బుక్‌ చేసి ఇతరులకు అమ్మే అధికారం ఉంటుంది. ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే చట్టం స్పష్టీకరిస్తోంది. శిక్షగా మూడేళ్ల జైలు లేదా రూ.10 వేల జరిమానా విధించవచ్చు.