వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తున్న ఘటనలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో టీనేజీ అబ్బాయిని కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి సోకి మరణించాడు. దీంతో ఈ విషయంపై మళ్లీ ఫోకస్ పెరిగింది. కాగా కేసు విచారణకు హాజరైన న్యాయవాది బ్యాండేజి కట్టుకుని కోర్టుకు హాజరయ్యారు. ఇది గమనించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏమైందని ప్రశ్నించగా.. ఐదు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి కరిచాయని, అందుకే ఇలా బ్యాండెడ్‌తో కోర్టుకు రావాల్సి వచ్చిందని లాయర్ వెల్లడించారు. దీంతో న్యాయమూర్తి మీ ఇల్లు ఎక్కడ అని అడిగారు. దీంతో ఆయన ఇంటి అడ్రస్ చెప్పారు. మీకు వైద్య సహాయం అవసరమైతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం అని న్యాయమూర్తి అన్నారు.
ఇంతలో ప్రభుత్వ న్యాయవాది, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. వీధి కుక్కలు కరవడం చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. ఇటీవల ఉత్తప్రదేశ్‌లో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసిన వీడియో బయటకు వచ్చిందని అన్నారు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు అతడికి రేబిస్ వచ్చిందని, ఏం చేయలేమని చెప్పారు. తన తండ్రి చేతుల్లోనే బాలుడు మరణించాడు అని తుషార్ మెహతా వెల్లడించారు. అయితే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఓ ఘటనను కోర్టులో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం తన లా క్లర్క్స్ కారు పార్క్ చేస్తుండగా కుక్కలు దాడి చేశాయని చెప్పారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ అంశంపై మాట్లాడుతూ వీధి కుక్కల అంశంపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరారు. అందుకు ఈ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
గత వారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో 14 ఏళ్ల బాలుడు రేబిస్ వ్యాధితో మరణించాడు. అతడిని అంతకు నెల రోజుల ముందు వీధి కుక్క కరిచింది. అయితే ఆ బాలుడు కుక్క కరిచిన విషయం ఇంట్లో చెప్పకుండా దాచాడు. దీంతో అతడికి రేబిస్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువైంది. తెలిసిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. వైద్యులు ఏమీ చేయలేకపోవడంతో బాలుడు మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీధికుక్కలకు ఆహారం పెడుతున్న పొరుగున ఉన్న వారిపై కేసు పెట్టారు.
కేరళలో ఓ తొమ్మిదేళ్ల బాలికపై వీధికుక్కలు ఇష్టం వచ్చినట్లు దాడి చేసిన ఘటన జరిగినే నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టు అత్యంత ప్రమాదకరమైన వీధికుక్కలను సునాయాసమైన పద్ధతిలో మరణించేలా చేయాలని ఆదేశించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు చుట్టుముట్టి దారుణంగా కరిచి చంపాయి. అవి దాడి చేసి చిన్నారిని పళ్లతో పట్టుకుని అటూ ఇటూ లాగడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వీధికుక్కలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి బాగా డిమాండ్లు వచ్చాయి. ఇలా తరచూ ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి.