Jammu Kashmir Landslide: శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలోని వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 30 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. మొదట ఈ ఘటనలో 9 మంది చనిపోయారని సమాచారం వచ్చింది. అనంతరం మృతుల సంఖ్య భారీగా పరిగినట్లు అధికారులు తెలిపారు. వినాయక చవతి పండుగనాడు జరిగిన ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులు వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు. భారీ వర్షాలతో జమ్మూకాశ్మీర్ లో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండ చరియలు విరిగిపడిన చోట సహాయక చర్యలు చేపట్టారు. భారత సైన్యం, CRPF, NDRF సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని రీసి ఎస్ఎస్‌పి పరంవీర్ సింగ్ తెలిపారు.

 మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. శిథిలాల కింద నుంచి బయటకు తీసిన వారిని అంబులెన్సులో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

వైష్ణో దేవి యాత్ర వాయిదా 

భారీ వర్షాలు కరుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా ఇప్పటివరకు మూడు వంతెనలు దెబ్బతిన్నాయని సమాచారం. కొండచరియలు విరిగిపడిన ఘటనతో మాతా వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. జమ్మూలోని పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు కథువాలోని రావి బ్రిడ్జిలో కొంత భాగం కొట్టుకుపోయింది. CRPF సిబ్బంది స్థానిక పౌరులు కొందరిని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రక్షించారు.

జమ్మూ నుంచి 5000 మంది తరలింపు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జమ్మూ డివిజన్ నుండి 5000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో  పోలీసులు, సైన్యం, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. చీనాబ్ నది నీటి మట్టం ఇంకా ఎక్కువగానే ఉంది. చీనాబ్ నది పరిసర ప్రాంతాల్లో కొంతమంది చిక్కుకుపోయారు, వారిని రక్షించడానికి సైన్యం సహాయక చర్యలు చేపట్టింది.

నెట్‌వర్క్ సమస్యప్రతికూల వాతావరణం కారణంగా కమ్యూనికేషన్ ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. జియో మొబైల్‌లో కొంత డేటా వస్తోంది. కానీ సరైన వైఫై సౌకర్యం అక్కడ సేవలు అందించడం లేదు. ఇంటర్నెట్ సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వాట్సాప్ లో చిన్న టెక్స్ట్ సందేశాలు మాత్రం పంపగలుగుతున్నారు.  2014, 2019 తరువాత జమ్మూ కాశ్మీర్ లో మరోసారి విపత్కర పరిస్థితులు నెలకొన్నాని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.