Lakhimpur Kheri Violence : లఖింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దు చేసింది. దీంతో ఆశిష్ మిశ్రా ఆదివారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. "కోర్టులో ఆశిష్ లొంగిపోయారు. మాకు వారం రోజుల సమయం ఇచ్చారు కానీ సోమవారం చివరి రోజు కావడంతో ఒక రోజు ముందుగానే లొంగిపోయారు" అని ఆశిష్ తరపు న్యాయవాది అవదేశ్ సింగ్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆశిష్‌ను జైలులోని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచుతామని జైలు సూపరింటెండెంట్ పీపీ సింగ్ తెలిపారు. 






బెయిల్ రద్దు 


ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది అక్టోబరు 3న ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు లఖింపూర్‌ ఖేరీలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వాహనాన్ని రైతుల మీదుగా పోనిచ్చారు. అనంతరం రైతులపై కాల్పులు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. 


ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి 


లఖింపూర్ ఖేరీ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. వీరిని బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న కార్లు ఢీకొట్టాయి. అనంతరం ఈ కేసులో ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసును "వాహనం ఢీకొనడం వల్ల జరిగిన ప్రమాదం" అని అభిప్రాయపడింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అతని బెయిల్‌ను రద్దు చేస్తూ చేసింది. అలహాబాద్ హైకోర్టు బాధితులకు "న్యాయమైన, సమర్థవంతమైన విచారణ" నిరాకరించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. 


అసలేం జరిగిందంటే? 


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్ ఖేరీ ఘటన కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలక నిజాలు బహిర్గతం చేసింది. అక్టోబర్ 3న జరిపిన జరిగిన దారుణ ఘటనలో కాల్పులు జరిపింది కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రానే అని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను కేసు నుంచి తప్పించాలని యత్నిస్తుండగా.. ఆయనకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలు వెలుగుచూశాయి. రైతులపై ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు అన్నదాతలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో కాల్పులు సైతం జరగడంతో కేసు మరింత సీరియస్ అయింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనాలు దూసుకెళ్లాయి. మొదట కొన్ని రోజులు పరారీలో ఉన్న ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందే కొందరు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.