Jagga Reddy Pressmeet: తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఓయూ లో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహిస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. అన్ని సంఘాల విద్యార్థి నాయకులు ఈ సమావేశానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు.  రేపు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి రాహుల్ గాంధీ సమావేశం కోసం అనుమతి కోరతామని జగ్గారెడ్డి చెప్పారు.


గాంధీభవన్‌లో ప్రెస్ మీట్‌లో జగ్గారెడ్డి ఏమన్నారంటే.. ఓయూలో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహిస్తారు. అన్ని సంఘాల నాయకులు కూడా విద్యార్ధుల కోసం సహకరించాలి. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగింది. ఇప్పుడు అన్ని సమస్యలకూ  రాహుల్ పరిష్కారం ఇస్తారు. ఏపీ నుంచి తెలంగాణ విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ. రాష్ట్ర సాధన కోంస విద్యార్ధుల ప్రాణాలు కోల్పోవద్దు అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని జగ్గారెడ్డి గుర్తుచేసుకున్నారు. 




ఓయూలో రాహుల్ గాంధీ మీటింగ్, అన్ని విద్యార్థి సంఘాలు సహకరించాలన్న కాంగ్రెస్


విద్యార్థుల త్యాగాలు మరువలేము..
రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది విద్యార్థులే. అటువంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం ఎన్నటికీ మరవలేము. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తాం. కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీ వస్తారు. యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. యూనివర్సిటీ సమస్యలతో పాటు ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారు. వర్సిటీ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఇది అవకాశంగా భావించాలన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రాహుల్ ఓయూకు వస్తారని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. 


ప్రశాంత్ కిషోర్ తీరుపై అనుమానాలు..
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానంతో కలిపి పనిచేస్తూ, రాష్ట్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేయడంపై జగ్గారెడ్డి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ తీరుపై రాష్ట్ర నేతలకు అనుమానాలు రావడం సహజం అన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్, సోనియా గాంధీలను కలవడం తమ పరిధిలోని అంశం కాదన్నారు. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ రాష్ట్ర, దేశ ప్రజల మేలు కోరే వ్యక్తులన్నారు.


కేసీఆర్ విఫలం.. బీజేపీ సైతం అంతే..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని.. మరోవైపు బీజేపీ సైతం రూ.15 లక్షలు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. లా అండ్ ఆర్డర్‌లో, పాలనలో కేసీఆర్ విఫలం కాగా, బీజేపీ సైతం అకౌంట్లలో వేస్తామని చెప్పిన రూ.15 లక్షలు ఏమయ్యాయో అడుగుతాం అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు జగ్గారెడ్డి. గాంధీభవన్‌లో ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పార్టీ నేతలు కొటూరి మనవతరాయ్, చెనగాని దయాకర్, డాక్టర్ కేతురీ వెంకటేష్, డాక్టర్ గడ్డం శ్రీనివాస్, కొప్పుల ప్రతాప్ రెడ్డి, మెట్టు సాయి(ఫిషరి సెల్ చైర్మన్) పాల్గొన్నారు.