Kerala MP Suresh Gopi: కేరళకు చెందిన బీజేపీ ఎంపీ సురేష్ గోపీ తనపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. సురేశ్ గోపీ మోదీ కేబినెట్ కు రాజీనామా చేస్తున్నారని పదే పదే మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. తాను మోదీ కేబినెట్‌లో సభ్యుడిగా ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతానని సురేష్ గోపీ స్పష్టం చేశారు. మంత్రిమండలిలో కొనసాగడం తనకు ఇష్టం లేదని.. రాజీనామా చేయబోతున్నారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయని అన్నారు.


ఇది పూర్తిగా తప్పు అని సురేష్ గోపీ ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. కేరళ ప్రజల తరపున మూడో మోదీ ప్రభుత్వంలో సభ్యుడిగా ఉండటం తన అదృష్టమని సురేష్ గోపి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, సుస్థిరత కోసం కృషి చేస్తామని సురేష్ గోపి తెలిపారు. త్రిసూర్‌లో విజయం సాధించడంతో సురేష్ గోపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది.


తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని.. అందుకు తనకు వచ్చిన కేంద్ర మంత్రి పదవి అడ్డంకి కావడంతో పదవికి సురేష్ గోపీ రాజీనామా చేస్తారని  మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని తాజాగా ఖండించారు. ప్రస్తుతం సురేష్ గోపీ చేతిలో మమ్ముట్టి సినిమాతో సహా మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో సురేశ్ గోపీ సినిమాల్లో నటించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు సహాయ మంత్రి పదవి ఇచ్చారని కూడా బీజేపీ వివరణ ఇచ్చింది. కేంద్ర మంత్రిగా సురేష్ గోపి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.