భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మరో రచ్చ ప్రారంభమయింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.  ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే వాటిని ఒక్కటిగా మార్చాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. దీంతో ఎంసీడీ ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రం తీరుపై మరోసారి మండిపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ ... అతి చిన్న ఎన్నికలను చూసి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రం మున్సిపల్ ఎన్నికలను సమయానికే నిర్వహించి.. అందులో బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీని మూసేస్తామని కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ చేసిన సవాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 







ఎలక్షన్ ను కొన్ని నెలల పాటు పోస్ట్ పోన్ చేసేందుకు సవరణ  చట్టం తీసుకొస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.  చిన్నపాటి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యవస్థలతో ఆడుకోవడం సరికాదు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అందరికీ తెలుసన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. ఢిల్లీలోని ఓ చిన్న పార్టీకి, చిన్న ఎలక్షన్ కు భయపడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, అందులో గెలిచి చూపించాలి. ఒకవేళ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం’ అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. 



నిజానికి పది రోజుల కిందటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీలను ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ వాయిదా వేసారు.  కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో నిలిపివేశారు. ఢిల్లీలో మూడు మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.  నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లును  కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని ఆప్ విమర్శిస్తోంది.