విషపూరిత చాక్లెట్లు తిని నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీ నగర్ జిల్లాలో బుధవారం ఈ విషాదకర సంఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారుల్లో ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు.
ఎలా జరిగింది?
ఖుషీ నగర్ జిల్లాలోని కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పొరిగింట్లో ఉంటోన్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు.
ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన చిన్నారుల్లో మంజన (5), స్వీటీ (3), సమర్ (2) తోబుట్టువులు. వీరితోపాటు అరుణ్ (5) కూడా చనిపోయాడు. ఖుషీ నగర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వరుణ్ కుమార్ పాండే ఈ వివరాలు తెలిపారు. మిగిలిన చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం భద్రపరిచినట్లు కలెక్టర్ వెల్లడించారు.
దర్యాప్తు
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు తెలిపారు.
Also Read: Corona Lockdown in US: అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్- ఆ వేరియంట్‌తో ముప్పు తప్పదా?
Also Read: AAP Delhi : డ్రైనేజీ క్లీన్ చేశాడని పాలాభిషేకం - ఢిల్లీలో ఆప్ కౌన్సిలర్ తీరు వైరల్