Siddaramaiah Education and Assets: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తదుపరి సీఎం ఎవరు అవుతారనే దానికి సమాధానం దొరికింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైపే అధిష్ఠానం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. సిద్ధరామయ్య పేరును ఈ సాయంత్రం బెంగళూరులో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విద్యార్హతలు ఏంటి, ఆయన ఆస్తుల విలువ ఎంత, ఆయనపై ఇప్పటి వరకు నమోదైన కేసులు ఎన్నో చూద్దాం.


డాక్టర్ కావాల్సిన వారు పొలిటిషియన్ అయ్యారు


సిద్ధరామయ్య 1947 ఆగస్టు 3వ తేదీన మైసూరులోని ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సిద్ధరామగౌడ వరుణ హోబ్లీలో వ్యవసాయం చేసే వారు. ఆయన తల్లి గృహిణి. సిద్ధరామయ్య ఐదుగురు తోబుట్టువుల్లో రెండో వారు. సిద్ధరామయ్య కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. సిద్ధరామయ్యను డాక్టర్ గా చూడాలని ఆయన తల్లిదండ్రుల కోరిక కానీ ఆయన మాత్రం న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. సిద్ధరామయ్య 1978 లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు ఉన్నత పదవులు చేపట్టారు. ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 2013 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలోని వరుణ సీటులో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


సిద్ధరామయ్య విద్యార్హత ఏంటంటే?


సిద్ధరామయ్య ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకు గ్రామంలోనే ఉంటూ చదివారు. ఆ తర్వాత బీఎస్సీ డిగ్రీ పట్టా పొంది, మైసూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. మైసూర్ కు చెందిన ప్రముఖ న్యాయవాది చిక్కబోరయ్యకు జూనియర్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు న్యాయశాస్త్రం బోధించారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 


Also Read: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? అదొక్కటే మైనస్ అయిందా?


అఫిటవిట్‌లో పేర్కొన్న ఆస్తులు ఎన్నంటే?


అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం సిద్ధరామయ్య ఆస్తుల విలువ రూ.19 కోట్లకుపైగా ఉంది. ధనిక కాంగ్రెస్ నాయకుల్లో సిద్ధరామయ్య కూడా ఒకరు. ఇందులో రూ.9.58 కోట్ల విలువైన చరాస్తులు, రూ.9.43 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే సిద్ధరామయ్య వద్ద రూ. 50 లక్షలకుపైగా విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 


రూ.7.15 లక్షల నగదు, రూ. 63,26,449 బ్యాంకు డిపాజిట్లు, రూ. 13 లక్షల విలువైన టొయోటా ఇన్నోవా కారు, రూ. 50,04,250 విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిర ఆస్తుల్లో రూ.1.15 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ.3.50 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి, రూ.5 కోట్ల విలువైన వాణిజ్య భవనం, రూ. 6 కోట్ విలువైన ఫ్లాట్లు, ఇళ్లు ఉన్నాయి. వీటితో పాటు తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు సిద్ధరామయ్య.