Karnataka Man who built his own tomb 20 years ago: కొందరు చేసే పనులు అవతలి వారిని ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఓ పెద్దాయన చేసిన పని ఎంతో ఆలోచనాత్మకంగా, ఆత్మాభిమానికి ప్రతీకగా నిలుస్తోంది. వయసులోనే కాదు, మనసులోనే పెద్దాయన అనిపించుకున్నాడు ఆ వృద్ధుడు. చనిపోవడానికి 20 ఏళ్ల ముందే తన డబ్బులతోనే సమాధి నిర్మించుకున్నాడు కర్ణాటకకు చెందిన వ్యక్తి. తాజాగా ఆయన కన్నుమూయడంతో సొంతంగా నిర్మించుకున్న సమాధిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..


కర్ణాటకలోని చామరాజనగర్​ తాలుకాలోని నంజదేవనపుర గ్రామంలో పుట్టమల్లప్ప అనే 85 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. ప్రస్తుత రోజుల్లో పరిస్థితులను కొన్నేళ్ల కిందట అర్థం చేసుకున్న పెద్దాయన రెండు దశాబ్దాల కిందట కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయాక సైతం ఎవరి మీద ఆధారపడవద్దని, తన అంత్యక్రియలు సొంత డబ్బులతోనే జరగాలని భావించాడు. ఆలోచించడమే కాదు ఆచరించి చూపించాడు. 20 ఏళ్ల కిందట సొంత డబ్బులు వెచ్చించి తన సమాధి నిర్మించుకున్నాడు పుట్టమల్లప్ప. సమాధి ఏర్పాటు చేసుకోవడంతో పాటు దాదాపు లక్ష రూపాయల నగదును అంత్యక్రియల కోసం దాచిపెట్టాడు. వాటిని తాను చనిపోయాక వినియోగించాలని కుటుంబసభ్యులకు, బంధువులకు ఏళ్ల కిందటే చెప్పాడు.


మనసున్న ధనవంతుడే..
పుట్టమల్లప్ప ధనవంతుడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే కరోనా సోకడంతో గత ఏడాది ఆయన భార్య కన్నుమూసింది. అప్పుడు కూడా తాను సొంతంగా సంపాదించిన నగదుతోనే భార్య అంత్యక్రియలు, కర్మ కాండలు జరిపించాడు. తాను చనిపోతే కుమారులకు బారం కాకూడదని, తన డబ్బులతోనే సమాధి నిర్మించుకున్నారు. దాదాపు 20 ఏళ్ల కిందట సమాధి నిర్మించుకోవడంతో పాటు అంత్యక్రియలు, కర్మల కోసం నగదు సిద్ధం చేశారని ఆయన కుమారుడు గౌడికే నగేశ్ తెలిపారు. 


సొంత డబ్బులతో అంత్యక్రియలు..
గత వారం పుట్టమల్లప్ప అస్వస్థతకు గురయ్యారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆ పెద్దాయన ఆదివారం కన్నుమూయగా.. ఆయన రెడీ చేసిన నగదుతోనే అంత్యక్రియలు నిర్వహించారు. తన తండ్రికి ఆత్మాభిమానం ఎక్కువని నగేశ్ తెలిపాడు. తన తండ్రి చివరి కోరిక అదేనని, ఆయన అనుకున్న విధంగానే సొంతంగా నిర్మించుకున్న సమాధిలో చివరి తంతు కార్యక్రమాలు జరిపించామన్నారు. పెద్ద కర్మ లాంటి వాటికి సైతం పుట్టమల్లప్ప ఇచ్చిన డబ్బులనే వినియోగిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.
Also Read: Benefits of Crying: ఏడుపు వస్తే ఆపుకోకండి, మనసుతీరా భోరున ఏడ్చేయండి, ఏడుపు ఆరోగ్యానికి మేలే చేస్తుంది


Also Read: Trending Lifestyles: హడావిడి జీవితానికి ఓ బ్రేక్ అవసరమే - మీరు ఎప్పుడైనా ఇలా గడిపారా ?