Bengaluru Stampede:  ఆర్సీబీ ఐపీఎల్‌ ట్రోఫీ విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంతో ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. కనీస వసతులు లేకుండా ఈవెంట్ ఎవరు ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు బుధవారం అధికారిక విచారణ ప్రారంభించింది. ఈవెంట్ల క్రమం, భద్రతా సన్నద్ధత, జనసమూహ నిర్వహణ ప్రణాళికలు, ఈవెంట్ నిర్వాహకులు, అధికారుల మధ్య సమన్వయాన్ని వివరిస్తూ వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడించాలని పేర్కొంది.  అందుకు ఐదు రోజుల సమయం ఇస్తూ కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.  

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట కేసులో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) యాజమాన్యం ఇరుక్కుంది. తొక్కిసలాట జరగడానికి కొన్ని గంటల ముందు RCB యాజమాన్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ పెట్టింది. దీనిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది.

మరోవైపు దర్యాప్తులో భాగంగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యుల్ని కూడా  ప్రశ్నించనున్నారు. సన్మాన వేడుకను ప్లాన్ చేయడంలో వారి పాత్రను ఇప్పుడు బెంగళూరు పోలీసులు మెజిస్టీరియల్ దర్యాప్తు ప్యానెల్ సమీక్షిస్తోంది. జూన్ 4న మధ్యాహ్నం 3:14 గంటలకు, RCB అధికారిక ఖాతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ప్రారంభమవుతుందని ధృవీకరిస్తుంది అందులో పేర్కొన్నారు. స్టేడియం లోపల సన్మాన కార్యక్రమం జరుగుతుందని కూడా చెప్పారు. ఉచిత పాస్‌ల కోసం లింక్ కూడా ఇచ్చారు. అభిమానులు పోలీసు మార్గదర్శకాలను పాటించాలని అభ్యర్థించారు.

పోస్ట్‌లో RCB యాజమాన్యం ఏమి చెప్పింది?

ఆ పోస్ట్‌లో, "విజయోత్సవ కవాతు తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అభిమానులు అందరూ రోడ్ షోను ప్రశాంతంగా ఆస్వాదించగలిగేలా పోలీసులు , ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని అభ్యర్థిస్తున్నాము. ఉచిత పాస్‌లు (పరిమిత ప్రవేశం) shop.royalchallengers.comలో అందుబాటులో ఉన్నాయి." అని వెల్లడించారు.