World Environment Day 2025 : ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. దినిలో భాగంగా పర్యావరణ సంరక్షణతో పాటు.. బాలికల సంక్షేమాన్ని చాటి చెప్తోన్నో ఓ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఓ గ్రామం. ఆ గ్రామంలో అమ్మాయి పుడితో 111 మొక్కలు నాటుతారు. అయితే అసలు ఇది ఎలా మొదలైంది. దాని వెనుకున్న రీజన్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ అనే జిల్లాలో పిప్లాంత్రీ(Piplantri) అనే గ్రామం ఉంది. అయితే కొన్నేళ్లుగా ఇక్కడో ఆనవాయితీ కొనసాగుతుంది. అదేంటంటే.. ఆ గ్రామంలో అమ్మాయి పుట్టిన ప్రతీసారి 111 మొక్కలు నాటుతారు. 2006 నుంచి ఇది కొనసాగుతూ ఉంది. పిప్లాంత్రీ గ్రామ సర్పంచ్ అయిన శ్యాం సుందర్ పాలివాల్ దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. 

కారణమిదే.. 

అప్పటి గ్రామ సర్పంచ్ అయిన శ్యాం సుందర్ కూతురు డీహైడ్రేషన్ కారణంతో మరణించింది. పర్యావరణంలో మార్పులు, నీటి సమస్యలు తదుపరి తరాలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె జ్ఞాపకార్థం ఈ గొప్ప పనికి నాంది పలికారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఏ అమ్మాయి పుట్టినా వారు 111 మొక్కలు నాటుతారు. మొక్కలు నీటి సమస్యను దూరం చేస్తాయని వారు బలంగా నమ్ముతారు. 

ప్రతి బాలిక కోసం..

ఈ కార్యక్రమం కేవలం పర్యావరణాన్నే కాదు.. బాలికల సంక్షేమాన్ని కూడా కాపాడుతుంది. పాప పుట్టిన ప్రతిసారి గ్రామస్తులు అంతా కలిసి 111 మొక్కలు నాటుతారు. ఇది ఆడపిల్లలపై ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది. అంతేకాకుండా ఇది పర్యావరణానికి అందించే బహుమతి అవుతుంది. అలా 2006 నుంచి 3 లక్షలకు పైగా మొక్కలు నాటారు ఈ గ్రామస్తులు. ఈ మొక్కలు గ్రామాన్ని పచ్చదనంతో నింపడంతో పాటు.. భూగర్భ జలాల స్థాయి పెంచడంలో బాగా హెల్ప్ చేశాయి. 

ఆర్థికాభివృద్ధి కూడా..

వేప, మామిడి, ఉసిరి వంటి చెట్లు ఎక్కువగా నాటుతారు. ఇవి పర్యావరణ వ్యవస్థతో పాటు.. ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచాయి. ఎలా అంటే వీరు మొక్కలు నాటి తమ పని అయిపోయిందనుకోలేదు. చెట్లను నాటి.. చెదపురుగుల నుంచి రక్షించడానికి వాటి చుట్టూ కలబంద మొక్కలను నాటారు. ఇవి మొక్కలను రక్షించడమే కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కూడా దారి తీశాయి. ఇక్కడి గ్రామస్తులు కలబంద రసం, జెల్ వంటి అలొవేరా ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, మార్కెంటింగ్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల వీరికి ఆదాయ వనరు అందుతుంది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. 

పర్యావరణ పరిరక్షణతో పాటు లింగ సమానత్వాన్ని ఈ పిప్లాంత్రీ గ్రామం చాటి చెప్పింది. ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరికో స్ఫూర్తినిచ్చింది. పర్యావరణాన్ని, ఆడపిల్లను గౌరవిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం వారికి నీటితో ఆర్థిక జీవనాన్ని మెరుగుపరిచింది. స్థిరమైన అభివృద్ధితో పాటు సామాజిక మార్పును కోరుకునే ప్రతి ఒక్కరూ పిప్లాంత్రీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.