Karnataka Elections:


కర్ణాటక ఎన్నికలపై RSS వ్యాఖ్యలు..


కచ్చితంగా గెలుస్తాం అనుకున్న కర్ణాటకలో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్‌ని భారీ మెజార్టీతో గెలిపించారు కన్నడిగులు. కాషాయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క దక్షిణాది రాష్ట్రం కూడా చేజారింది. అందులోనూ 2024కి ముందు జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల పార్టీలో అంతర్మథనం మొదలైంది. "ఎక్కడ తప్పు జరిగింది" అని అనలైజ్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) బీజేపీకి కీలక సలహా ఇచ్చింది. "ఆత్మపరిశీలన" చేసుకోండి అని సూచించింది. అంతే కాదు. లోకల్‌గా క్యాడర్ పెంచుకోకుండా ఏ రాష్ట్రంలోనైనా గెలవడం కష్టమేనని తేల్చి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, హిందుత్వ రాజకీయాలు అన్ని చోట్లా పని చేయవని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలవడానికి ఇవి మాత్రమే సరిపోవని వెల్లడించింది. ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్నీ గుర్తు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి గల కారణాలనూ ప్రస్తావించింది RSS.కర్ణాటకలో బీజేపీ జాతీయ రాజకీయాల గురించి పదేపదే ప్రస్తావించిందని చెప్పిన ఆర్ఎస్‌ఎస్..కాంగ్రెస్ పూర్తిగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిందని వివరించింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి ఇదే కారణమని తెలిపింది. ఇక్కడ కుల రాజకీయాలతో ఓట్లు రాబట్టుకోవాలని చూశారని...కానీ కర్ణాటక ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేసింది RSS. రాష్ట్రంలో బీజేపీ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణల్ని ఆ పార్టీ సరైన విధంగా డిఫెండ్ చేసుకోలేకపోయిందని వెల్లడించింది. 


ఇదే తొలిసారి..


సాధారణంగా ఎన్నికల గురించి ఎప్పుడూ RSS పెద్దగా మాట్లాడదు. అలాగే బీజేపీకి సలహాలు ఇచ్చిన దాఖలాలూ లేవు. కానీ...తొలిసారి ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ సలహాలు ఇవ్వడం కీలకంగా మారింది. ఇప్పుడిదే వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అవుతోంది. కర్ణాటక ప్రజలు ప్రధాని మోదీని తిరస్కరించారన్న నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలని చురకలు అంటిస్తోంది. బీజేపీ దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సెటైర్లు వేస్తోంది.  ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలకే పరిమితమైది. కింగ్‌మేకర్‌గా మారతామని ధీమాగా చెప్పిన జేడీఎస్ డీలా పడింది. 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మొదటి నుంచి బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగించింది కాంగ్రెస్. 40% కమీషన్ ప్రభుత్వం అంటూ సెటైర్లు వేసింది. స్థానిక సమస్యల్నే ఎక్కువగా ప్రస్తావించింది. వీటితో పాటు ప్రజల్ని ఆకట్టుకునేలా 5 హామీలు ఇచ్చింది. ఉచిత విద్యుత్ అంటూ అందరినీ ఆకర్షించింది. ఫలితంగా...మెజార్టీ ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయి. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే కేబినెట్ మీటింగ్‌ నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఈ హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం హామీ కూడా ఓట్లు బాగానే రాల్చింది. 


Also Read: Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్