Karnataka Budget 2023:
హామీల అమలుకు రూ. 52 వేల కోట్లు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన 5 హామీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం...బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.52వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 1.3 కోట్ల కుటుంబాలకు వీటి ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.3.27 లక్షల కోట్ల పద్దు ప్రకటించింది సిద్దరామయ్య సర్కార్. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి నెలవారీగా కనీసం రూ.4-5 వేల మేర ఆర్థిక సాయం అందనుంది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్‌ల వరకూ ఉచిత విద్యుత్, పేదలకు నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, ప్రతి మహిళకు నెలనెలరా రూ.2 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు రూ.3వేల మేర భృతి అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ హామీల కారణంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందుకే..వీటిని నిలబెట్టుకోడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. నిజానికి..ఇది తలకు మించిన భారమే అయినప్పటికీ...ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని తేల్చి చెప్పింది. ఉచిత హామీలపై బీజేపీ పదేపదే విమర్శలు చేసినా వాటిని పట్టించుకోలేదు సిద్దరామయ్య. పైగా...ఇవి ఉచిత పథకాలు కావు అని తేల్చి చెప్పారు. "మేం ఇచ్చేవి ఏవీ ఉచిత పథకాలు కావు. నిరుపేదలకు చేరుకోవాల్సిన అసలైన సంక్షేమం ఇదే" అని ప్రకటించారు.
సిద్దరామయ్య రికార్డు..
కర్ణాటక ఆర్థిక మంత్రిగా 14వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు సిద్దరామయ్య. గతంలో రామకృష్ణ హెగ్డే 13 సార్లు పద్దు ప్రవేశ పెట్టారు. ఇప్పుడా రికార్డుని బద్దలు కొట్టారు సిద్దరామయ్య. ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సమయంలోనే కీలక నిర్ణయాలు ప్రకటించారు. బీర్‌పై ఎక్సైజ్ డ్యూటీని 175% నుంచి 185%కి పెంచారు. జులై 3వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రజల సంక్షేమాన్నే దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరిపాలించాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ సూచించారు. ముఖ్యంగా యువనిధి పథకం కింద ఎక్కువ మంది యువతకు నిరుద్యోగ భృతి అందేలా చూడాలని చెప్పారు. వీటితో పాటు గృహ జ్యోతి యోజన,గృహ లక్ష్మి, శక్తి లాంటి పథకాలు మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది ప్రభుత్వం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది...మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. "శక్తి యోజనే" (Shakti Yojane) పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. జూన్ 11న అధికారికంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించారు.
Also Read: బస్‌లో ఫ్రీ సీట్ కోసం బుర్కా వేసుకున్న హిందువు, నిలదీసిన స్థానికులు