Assam Madrasas Closed : అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. అస్సాం రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నామన్నారు. నవ భారత్ లో మదర్సాలు అవసరం లేదన్నారని బిశ్వ శర్మ అన్నారు. కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వివాదాస్పదత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు అస్సాంకు వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పును సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, మాకు మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని అనుకుంటున్నానన్నారు. అస్సాంకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి కానీ మదర్సాలు వద్దని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.
600 మదర్సాలు మూసివేత
కర్ణాటకలోని బెల్గావిలో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి అస్సాం సీఎం బిశ్వ శర్మ ప్రసంగించారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఈశాన్య రాష్ట్రానికి వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు. అందుకే అస్సాంలో 600 మదర్సాలను మూసివేశామన్నారు. మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని భావిస్తున్నామన్నారు. మాకు పాఠశాలలు, కళాశాలలు విశ్వవిద్యాలయాలు కావాలని బిశ్వ శర్మ అన్నారని వార్తా సంస్థ ANI తెలిపింది.
అస్సాంలో ఉగ్రవాదులు
బంగ్లాదేశ్‌లోని అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఐదు జిహాదీ సంస్థలు అస్సాంలో జిహాదీ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాయని గత ఏడాది సీఎం బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు 2016, 2017 మధ్య భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్‌ని ఏర్పాటు చేసి స్థానిక యువకులకు జిహాదీ వైపు ఆకర్షించారన్నారు.
కాంగ్రెస్ పై విమర్శలు
బెల్గావి ర్యాలీలో అస్సాం సీఎం బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఒకప్పుడు దిల్లీ పాలకులు దేవాలయాలను కూల్చివేయాలని మాట్లాడేవారని, కానీ నేడు ప్రధాని మోదీ పాలనలో దేవాలయాలు కట్టడం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇది నవ భారతావని అన్నారు. ఈ నవ భారతాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని విమర్శించారు. కొత్త మొఘల్‌లకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొఘల్స్ హైలైట్ చేశారని ఆరోపించారు. చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయకుండా ... అంతా బాబర్, ఔరంగజేబు, షాజహాన్‌లదే అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూపించారన్నారు. భారతదేశ చరిత్ర ఛత్రపతి శివాజీ మహరాజ్, గురుగోవింద్ సింగ్ గురించి అని నేను చెప్పాలనుకుంటున్నానన్నారు. ఔరంగజేబ్ పాలనలో ఇతర మతస్థులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపించారు. 'సనాతన్' సంస్కృతిని అంతం చేయడానికి ఔరంగజేబ్ ప్రయత్నించారని శర్మ అన్నారు.