ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే వరకు దారిలో ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నానని అన్నారు రిటైర్డ్‌ సీజేఐ ఎన్వీ రమణ. సత్యమే జయించిందని కామెంట్ చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సవాళ్లు, వివాదాలు ఎదురైనప్పుడు తాను ఏంటో నిరూపించుకుంటేనే మనిషి అంటారని లూథర్ కింగ్‌ జూనియర్ చేప్పిన కోట్‌ను కోడ్‌ చేశారు. ప్రతి ఫెయిల్యూర్‌ వెనుక ఓ విజయం దాగి ఉందని గ్రహించి సవాళ్లను స్వీకరిస్తూ ఈ స్థితికి చేరుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం కూడా దెబ్బతిందన్నారు. అత్యంత సంతృప్తితో సీజేఐగా పదవీవిరమణ చేస్తున్నట్టు వివరించారు జస్టిస్‌ ఎన్వీ రమణ. 


న్యాయమూర్తిగా అనుసరించాల్సిన విధివిధానాలను పాటించానన్నారు. నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లలేదని తెలిపారు. నైతిక శక్తిని గుర్తించిన న్యాయమూర్తిగా మిగిలిపోతును అని అభిప్రాయపడ్డారు. 






ప్రజల మనుసల్లో నిలిచిపోవాలని తన కోరికగా ఉండేదని... కానీ న్యాయ గ్రంథాల్లో ఉండాలనే కోరిక మాత్రం లేదన్నారు జస్టిస్‌ ఎన్వీరమణ. చివరి శ్వాస వరకు రాజ్యాంగ విలువలు కాపాడతానన్నారు. న్యాయ వ్యవస్థలో ఇంకా మార్పులు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. సమాజంలోని వాస్తవికతను అనుగుణంగా న్యాయవ్యవస్థ ఉండాలని తెలిపారు. ప్రజలకు మరింత చేరువుగా న్యాయవ్యవస్థ వెళ్లాలని సూచించారు. 


కేసులను పరిష్కరించే విషయంలో న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ నిధులు, నియామకల్లో ఇంకా ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు జస్టిస్‌ ఎన్వీ రమణ. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు అవసరమని తెలిపారు. 75 ఏళ్లలో న్యాయ వ్యవస్థ ఎంతో పరిణితి చెందిందని గుర్తు చేశారు. ఏన్నో కేసులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు జస్టిస్‌ రమణ. 


కృష్ణా జిల్లా పొన్నవరం అనే చిన్న పల్లెటూరు నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేశారు జస్టిస్ ఎన్వీ రమణ. కనీస వసతుల్లేని పల్లెలో పుట్టి ఎన్నో పోరాటాల తర్వాత ఆ స్థాయికి చేరుకున్నట్టు వివరించారు. తనకు అంతటి శక్తిని ఇచ్చిన ఉపాధ్యాయులకు స్నేహితులకు, బంధువులకు జస్టిస్ రమణ కృతజ్ఞతలు చెప్పారు. జీవితలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని... ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయలేదన్నారు.