Judge hearing Delhi excise policy case transferred: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారిస్తున్న జడ్జి జస్టిస్ నాగ్ పాల్ స్థానంలో జడ్జి జస్టిస్ కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ జ్యుడిషియల్ పరిధిలోని మరో 50 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మరోవైపు కవితను మంగళవారం మూడో రోజు ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. విచారణ పూర్తయ్యాక సోదరుడు కేటీఆర్ ఆమెను కలిసినట్లు సమాచారం.
లిక్కర్ కేసులో కవితే ప్రధాన కుట్రదారు: ఈడీ రిమాండ్ రిపోర్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కవితను ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 17 నుంచి మార్చి 23 వరకు ఈడీ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆమెను విచారించనున్నారు. ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపర్చారు. ఈ కేసులో కవితనే కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంటతో కలిసి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారు. మార్జిన్ మనీని 12శాతానికి పెంచారని ఈడీ తెలిపింది. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమ్మన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని... లిక్కర్ పాలసీలో బిజినెస్ కోసం కవిత తనను సంప్రదించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు కవిత కస్టడీ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు పేర్కొంది.