Jharkhand: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో సోమ‌వారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పక్కా సమాచారంతో పలాము-ఛత్రా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై సమాచారం అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, కోబ్రా బెటాలియన్, రాష్ట్ర సాయుధ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. 


భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో పోలీసులు జరిపిన ఎదురుదాడిలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకోగా, అతని కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన మావోయిస్టుల్లో.. ఇద్దరిపై రూ. 25 లక్షలు, మరో ఇద్దరిపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టుగా వెల్ల‌డించారు. ఘటన స్థ‌లంలో రెండు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


రాష్ట్ర రాజధాని రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న లావాలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛ‌త్రా-పాలము సరిహద్దు వెంబడి ఎన్‌కౌంటర్ జరిగింద‌ని... ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామ‌ని ఛత్రా ఎస్పీ రాకేష్ రంజన్ తెలిపారు. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన‌ ఐదుగురు మావోయిస్టుల్లో గౌతం పాశ్వాన్, చార్లీ SAC సభ్యులని, వారిపై రూ. 25 లక్షల చొప్పున‌ రివార్డు ఉంద‌ని ఎస్పీ వెల్ల‌డించారు. మృతుల్లో నందు, అమర్ గంజు, సంజీవ్ భుయాన్ సబ్-జోనల్ కమాండర్లు.. వీరిపై రూ.5 లక్షల చొప్పున‌ రివార్డ్ ఉంద‌ని తెలిపారు.


మావోయిస్టుల‌కు సహకరించిన వారి ఆచూకీ కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు కొనసాగుస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు రెండు ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకోగా.. అడవిలో మరికొన్ని ఆయుధాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.